బెంగళూరు దేశంలోనే టెక్ సిటీగా పేరుగాంచింది. బెంగళూరు సిటీ అంటే సుందరవనానికి మారుపేరు. అలాంటి నగరం ఇప్పుడు కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. నగర రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి. రోడ్లన్నీ అధ్వాన్నంగా తయారయ్యాయి. ఎటుచూసినా లోతైన గుంతలు.. నీళ్లు ఉన్నాయి. దీంతో వాహనదారుల ఒళ్లు హూనమైపోతుంది. రోడ్లపై విసుగెత్తిన బెంగళూరు వాసి బీబీఎంపీకి రూ.50లక్షల పరిహారం కోరుతూ లీగల్ నోటీసు పంపించాడు.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రాలో కనిపించని పశ్చాత్తాపం.. ఐబీ ఆశ్చర్యం
బెంగళూరుకు చెందిన దివ్య కిరణ్ అనే వ్యక్తి.. అస్తవ్యస్తంగా తయారైన రోడ్లను చూసి విసుగెత్తిపోయాడు. బెంగళూరు మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశాడు. అస్తవ్యస్తమైన రోడ్లు కారణంగా శారీరిక, మానసిక సమస్యలు తలెత్తాయని బెంగళూరు వాసి దివ్య కిరణ్ వాపోయాడు. ఇందుకు రూ.50 లక్షలు పరిహారం కోరుతూ 43 ఏళ్ల దివ్య కిరణ్.. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP)కి లీగల్ నోటీసు పంపాడు. నోటీసులో 9 ఆస్పత్రులకు సంబంధించిన మెడికల్ స్టేట్‌మెంట్లను కూడా జత చేశాడు. తన ఆరోగ్య సమస్యలకు బెంగళూరు రోడ్లే కారణమని దివ్య కిరణ్ ఆరోపించాడు. మౌలిక సదుపాయాలు కల్పించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని తెలిపాడు. లోతైన గుంతలు, అసమాన మార్గాలు కారణంగా వాహనాలు నడపలేని స్థితి కారణంగా శారీరిక, మానసిక సమస్యలు తలెత్తినట్లు పేర్కొ్న్నాడు. తీవ్రమైన మెడ, వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు వాపోయాడు. ఆర్థోపెడిక్ నిపుణులను ఐదుసార్లు కలిశానని.. సెయింట్ ఫిలోమినా ఆసుపత్రికి నాలుగుసార్లు అత్యవసర సందర్శనలు చేసినట్లు చెప్పాడు. తీవ్రమైన నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఇంజెక్షన్లు మరియు చికిత్సలు చేయించుకున్నట్లు వెల్లడించాడు. రూ.50లక్షల పరిహారంతో పాటు తన లీగల్ ఛార్జీలు రూ.10,000 కూడా చెల్లించాలంటూ నోటీసులో పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: భారత్‌పై ద్వేషం.. పాక్‌పై మమకారం.. జ్యోతి మల్హోత్రా అలా మారిపోవడానికి కారణమేంటి?
ఒకవేళ తన లీగల్ నోటీసుకు స్పందించకపోతే అవసరమైన తదుపరి చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులకు వెనుకాడనని హెచ్చరించాడు. హైకోర్టును ఆశ్రయించడంతో పాటు లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా సంప్రదిస్తానని వార్నింగ్ ఇచ్చాడు.
ఇదిలా ఉంటే సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి బెంగళూరు అతలాకుతలం అయిపోయింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు నీట మునిగాయి. ప్రజలు పడవల్లో ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఇక నిన్నటి వర్షానికి ముగ్గురు చనిపోయారు. ఇక రహదారులు జలమయం కావడానికి ప్రజలే కారణమని మంత్రి పరమేశ్వర్ ఆరోపించారు.