ఉక్రెయిన్, రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా బీర్ల ధరలు భారీగా పెరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే బీరు తయారీలోకి వినియోగించే ప్రధాన ముడి పదార్థం బార్లీ ఉత్పత్తిలో రష్యా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. బీర్ తయారీకి మరొక ముడి పదార్థం మాల్ట్ ఉత్పత్తిలో ఉక్రెయిన్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశం. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆగకుండా ఇలాగే మరికొంత కాలం జరిగితే బార్లీ కొరత ఏర్పడనుందని బిజినెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో బార్లీ ధరలకు రెక్కలు వస్తాయంటున్నారు.
ఒకవేళ బార్లీ ధరలు పెరిగితే బీర్ల తయారీ కంపెనీలకు వ్యయం తలకు మించిన భారం అవుతుంది. అంతిమంగా బీరు తాగే వారే ఈ భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ బీర్ కంపెనీ బీరా 91 సీఈవో అంకుర్ జైన్ స్పందించారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం అంతర్జాతీయంగా బార్లీ ధరలను ప్రభావితం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ధరలు పెరిగాయని.. ఈ పరిస్థితి ఇంకొంతకాలం కొనసాగే అవకాశం ఉంటుందని తాము అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఆల్కహాల్ ధరలను నిర్ణయించడంలో రాష్ట్రాలదే ముఖ్య పాత్ర అని అంకుర్ జైన్ తెలిపారు.