Bangladesh: గత అమెరికా పాలకుల అండదండలతో విర్రివీసిన బంగ్లాదేశ్, దాని తాత్కాలిక ప్రభుత్వం అధినేత మహ్మద్ యూనస్‌కి యూఎస్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బిగ్ షాక్ ఇచ్చారు. 90 రోజుల పాటు అన్ని విదేశీ సాయాలను నిలిపేయాలని ఆదేశించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వానికి యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (USAID) శనివారం తన నిధులను నిలిపివేసింది. జనవరి 20 నుంచి ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల ప్రకారం..విదేశాలకు సాయాన్ని నిలిపేసింది. ఇజ్రాయిల్, ఈజిప్ట్ మాత్రమే ఈ జాబితా నుంచి మినహాయించబడ్డాయి.
Read Also: Donald Trump: గాజా ప్రజల్ని జోర్డాన్, ఈజిప్ట్ తీసుకోవాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఈ పరిణామం బంగ్లాదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా యూనస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ మతోన్మాదం పెరుగుతోంది. భారత్‌తో శత్రుత్వంతో పాటు పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ చెలిమి చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ఆర్థిక పరిస్థితి దివాళా అంచుకు వెళ్తోంది. విద్యుత్ సరిగా లేకపోవడంతో పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. ముఖ్యంగా వస్త్రపరిశ్రమకు కేరాఫ్‌గా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. తాజాగా అమెరికా ఇచ్చే సాయం కూడా నిలిచిపోవడంతో రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ ఇతర దేశాలకు వెళ్లి అడుక్కోవడమే మిగిలింది. బంగ్లాదేశ్ తగ్గిపోతున్న విదేశీ మారక నిల్వల స్థిరీకరణ కోసం అంతర్జాతీయ రుణదాతల నుంచి యూనస్ ప్రభుత్వం 5 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అభ్యర్థించింది. ఐఎంఎఫ్ నుంచి 4.7 బిలియన్ల బెయిల్‌అవుట్‌ని కోరింది.
ఇటీవల అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ గురించి చర్చించారు. తాము బంగ్లాదేశ్‌పై చర్చించామని, ఈ అంశంపై మరిన్ని వివారాల్లోకి వెళ్లడం సముచితమని నేను అనుకోవడం లేదని జైశంకర్ అన్నారు. మరోవైపు బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్స్, బౌద్ధులపై జరుగుతున్న అకృత్యాలపై పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు మండిపడుతున్నారు. ఆ దేశంపై ఆంక్షలు విధించాలని కోరారు.