NTV Telugu Site icon

Bangladeshi Hindus: భారత్‌లోకి వచ్చేందుకు బంగ్లాదేశ్ హిందువుల ప్రయత్నం.. నీటిలో నిలబడి నిరసన..!

Bsf

Bsf

Bangladeshi Hindus: బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ అక్కడ హింస కొనసాగుతోంది. ఆందోళనకారులు మైనారిటీ వర్గాలైన హిందువులను టార్గెట్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ (భారత సరిహద్దులో ఉన్న బంగ్లాదేశ్‌ ప్రజలు) నుంచి చాలా హిందూ కుటుంబాలు తమ ఇళ్లను వదిలి భారతదేశానికి రావాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. భారత్ -బంగ్లా సరిహద్దులోకి వేలాది మంది ప్రజలు చేరుకున్నారు. సరిహద్దు భద్రత విషయంలో బీఎస్ఎఫ్ కూడా అప్రమత్తమైంది. దాదాపు 1000 మంది బంగ్లాదేశీయులు బెంగాల్‌లోని సితాల్‌కుచి, కూచ్ బెహార్‌లోని రిజర్వాయర్‌లో నిలబడి.. తమను భారతదేశంలోకి అనుమతించమని బీఎస్ఎఫ్ సిబ్బందిని అభ్యర్థిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న వారిలో ఇదే అతి పెద్ద గ్రూపు అని బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు.

Read Also: Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..

కాగా, కూచ్ బెహార్‌లోని కాషియార్ బరుని ప్రాంతంలోని పతంతులి గ్రామం దగ్గర సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన ప్రజలు కంచె దాటి రిజర్వాయర్‌లో గంటల తరబడి నిరీక్షించారు. అందులో కొందరు ‘జై శ్రీరామ్’, ‘భారత్ మాతాకీ జై’ అంటూ నినాదాలు కూడా చేశారు. సరిహద్దులోని జీరో పాయింట్ నుంచి 150 గజాల దూరంలో ఉన్న కంచెను దాటకుండా బీఎస్ఎఫ్ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ జిల్లాలోని దోయ్ ఖావా, గెందుగురి గ్రామాలలోని ప్రజలను తిరిగి తమ ఇళ్లకు వెళ్లమని బీఎస్ఎఫ్ సైనికులు విజ్ఞప్తులు చేసినప్పటికీ.. వారు మాత్రం అక్కడే నిలబడి ఆందోళన చేస్తున్నారు.

Read Also: Israel–Hamas war: గాజాలో నిరాశ్రయులు బస చేస్తున్న స్కూల్‌పై ఇజ్రాయెల్ దాడి.. 100 మందికి పైగా మృతి

అయితే, గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌కు చెందిన ప్రజలు బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల్లోని పెట్రాపోల్‌కు చేరుకుంటున్నారు. సరిహద్దుపై నిఘా ఉంచేందుకు భారత ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సరిహద్దు భద్రతా దళం తూర్పు కమాండ్ ఏడీజీని కమిటీకి చైర్మన్‌గా ఎంపిక చేసింది. బంగ్లాదేశ్‌లో హింసాత్మక సంఘటనలు భారత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేశాయి.