Pakistan-Bangladesh: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా గద్దె దిగినప్పటి నుంచి ఆ దేశం పాకిస్తాన్‌కి దగ్గరవుతోంది. అక్కడ ఇస్లామిక్ రాడికల్ గ్రూపులు పాకిస్తాన్‌తో బంగ్లాదేశ్ సంబంధాలు పెంచుకోవాలని చెబుతున్నాయి. దీనికి తగ్గట్లుగానే మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌తో తెగ చర్చలు జరుపుతోంది. భారత్‌ని ఇబ్బంది పెట్టేలా బంగ్లాదేశ్ ప్రవర్తిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా పాకిస్తాన్ ప్రధానితో, బంగ్లాదేశ్ అధినేత మహ్మద్ యూనస్ న్యూయార్క్‌లో సమావేశమయ్యారు. భారత్ సభ్యదేశంగా ఉన్న ‘‘దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ(సార్క్)’’ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చాయి.
సార్క్‌లో భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, మాల్దీవులు మరియు నేపాల్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. అయితే, 2016 నుంచి ఈ గ్రూప్ ప్రభావవంతంగా లేదు. 2014లో నేపాల్ రాజధాని ఖాట్మాండులో చివరిసారిగా సార్క్ ద్వైవార్షిక శిఖరాగ్ర సమావేశాలు జరిగాయి. అయితే, ఇప్పుడు పాక్, బంగ్లాలు భారత వ్యతిరేఖ భావాలను కలిగి ఉన్నాయి. సార్క్ పునరుద్ధరణని కోరుతున్నాయి. బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు మహ్మద్ యూనస్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్‌జీఏ) సందర్భంగా కలుసుకున్నారు. పలు అంశాలపై చర్చించారు. దీంట్లో సార్క్ ప్రధాన అంశంగా నిలిచింది.
Read Also: Narsingi Police Station: నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ, హర్షసాయి రేప్ కేసుల దర్యాప్తు
పాక్-బంగ్లాలు సార్క్ పునరుద్ధరణను ఎందుకు కోరుకుంటున్నాయి..?
ఆగస్టులో బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించారు.ఇప్పుడు పాక్ లాగే బంగ్లా కూడా ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో ఆర్థిక సహకారాన్ని పెంచడానికి సార్క్‌ని పునరుద్ధరించాలని పిలుపునిచ్చింది. బుధవారం యూనస్ షరీఫ్‌ని కలిశారు. సార్క్ పునరుద్ధరణకు పాక్ మద్దతు ఉంటుందని షరీఫ్ హామీ ఇచ్చారు.
సార్క్ చార్టర్ నిబంధనల ప్రకారం.. ఏదైనా ఒక సభ్యదేశం హాజరుకాకుంటే శిఖరాగ్ర సమావేశాలు జరపలేరు. 2016లో సార్క్ సమావేశాలు ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సి ఉంది. అయితే, హాజరయ్యేందుకు భారత్ ఇష్టం చూపలేదు. 2016లో పఠాన్ కోట్, ఉరీ దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు చెడిపోయాయి. ఈ నేపథ్యంలోనే సార్క్ సమావేశాలకు హాజరయ్యేందుకు భారత్ నిరాకరించింది. భారత్ దారిలోనే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ కూడా నిరాకరించాయి.
2016 జనవరిలో పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై పాక్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు భద్రతా సిబ్బంది సహా 8 మంది మృతి చెందగా, 38 మంది గాయపడ్డారు. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీం(జేఐటీ) సందర్శించింది. అన్ని వివరాలను భారత్ సమర్పించింది. జైషే మహ్మద్ ఈదాడికి పాల్పడినట్లు సాక్ష్యాలు అందించింది. అయితే, విచారణ తర్వాత పాక్ చేరిన ఈ టీం, భారత్ కావాలనే డ్రామా చేస్తోందని, పాకిస్తాన్‌ని కించపరిచేలా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా చేస్తుందని ఆరోపించింది.
2016లో సెప్టెంబర్ 18న సార్క్ సమావేశానికి రెండు నెలల ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత సైనిక శిబిరంపై ఉగ్రదాది చేశారు. ఇందులో 19 మంది సైనికులు మరణించారు. ఆ తర్వాత సెప్టెంబర్ 28న భారత సైన్యం పాక్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసింది. దీని తర్వాత 2019, ఫిబ్రవరి 14న పుల్వామా దాడికి పాల్పడింది. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. ఈ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ ఉగ్రశిబిరాలపై వైమానిక దాడి చేసింది. పుల్వామా దాడి జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ పనిగా గుర్తించింది.
2022లో అప్పటి పాక్ విదేశాంగ ప్రతినిధి అసిమ్ ఇఫ్తికార్ భారతదేశమే సార్క్ ప్రక్రియను అడ్డుకుంటుందని ఆరోపించారు. అతని ప్రకటన తర్వాత అప్పటి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. సార్క్ సమావేశాలు ఆగిపోవడానికి నేపథ్యం అందరికి తెలుసని, పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని అప్పటి నుంచి శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించడానికి ఏకాభిప్రాయం కుదరలేదని అన్నారు.