Bangladesh MP: బంగ్లాదేశ్‌లో అధికార షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కి చెందిన ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ కోల్‌కతాలో హత్యకు గురవ్వడం సంచలనంగా మారింది. మే 13 నుంచి ఆయన అదృశ్యమయ్యారు. వైద్యం కోసం ఆయన భారత్‌కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసును పశ్చిమ బెంగాల్ రాష్ట్ర సీఐడీ విచారిస్తోందని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యఅ ని, భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని, దాదాపు రూ. 5 కోట్లను ఎంపీని చంపేందుకు ఆయన స్నేహితుడు సుపారీగా చెల్లించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
Read Also: Ricky Ponting: బీసీసీఐ ఆఫర్ను రిజెక్ట్ చేసిన రికీ పాంటింగ్.. కారణమేంటంటే..?
ఎంపీ స్నేహితుడు అమెరికన్ జాతీయుడని, కోల్‌కతాలో ఓ ఫ్లాట్ కలిగి ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు బంగ్లాదేశ్ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ బుధవారం తెలిపారు. ఎంపీ అనార్ హత్య చేయబడి ఉండొచ్చని, మాకు నమ్మదగిన సమాచారం ఉందని సీఐడీ ఐజీ అఖిలేష్ చతుర్వేది బుధవారం చెప్పారు. అయితే, అతని మృతదేహాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేదు. కోల్‌కతా శివార్లలో న్యూ టౌన్‌లోని అపార్ట్‌మెంట్‌లో రక్తపు మరకలు కనుగొన్నట్లు తెలుస్తోంది. దీనిపై చతుర్వేది మాట్లాడుతూ.. మా ఫోరెన్సిక్ బృందం అనుమానాస్పద నేరస్థలాన్ని పరిశీలిస్తోందని, దీని గురించి ఇంత తొందరగా ఏం మాట్లాడలేమని చెప్పారు.
ఉత్తర కోల్‌కతాలోని బారానగర్ నివాసి, ఎంపీకి పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్, ఎంపీ అదృశ్యం గురించి తొలిసారిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య చికిత్స కోసం మే 12 న కోల్‌కతాకు వచ్చిన తప్పిపోయిన ఎంపీ కోసం ఆరు రోజుల తర్వాత మే 18న వెతకడం ప్రారంభించారు. అనార్ వచ్చిన తర్వాత బిశ్వాస్ ఇంట్లో బస చేశారు. మే మే 13 మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్‌మెంట్ కోసం శ్రీ అనార్ తన బారానగర్ నివాసం నుంచి బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి ఇంటికి వస్తానని చెప్పినప్పటికీ, రాలేదు.