POK: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో ‘ఆజాదీ’ నినాదాలు మిన్నంటుతున్నాయి. పాకిస్తాన్ నుంచి విముక్తి కావాలంటూ పీఓకే ప్రజలు ఉద్యమిస్తున్నారు. అయితే, ఈ నిరసనలను అణిచివేసేందుకు పాకిస్తాన్ శతవిధాలా ప్రయత్నిస్తోంది. పాక్ రేంజర్లు, స్థానిక పోలీసులుతో దాడులు చేయిస్తోంది. ఇప్పటికే ఈ నిరసనల్లో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. శనివారం జరిగిన ఘర్షనల్లో ఒక పోలీస్ అధికారితో పాటు మరో 90 మంది గాయపడ్డారు. ఇదిలా ఉంటే ఈ నిరసనల్లో భారత జెండాను ప్రదర్శించడంపై పాకిస్తాన్ మరింత అప్రమత్తమైంది.
Read Also: Amit Shah: పాక్ వద్ద అణుబాంబులు ఉంటే పీఓకేని వదిలేయాలా..? కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అమిత్ షా ఫైర్..
ద్రవ్యోల్భణం, అధిక పన్నులు, విద్యుత్ కొరతకు వ్యతిరేకంగా పీఓకే ప్రాంతంలోని ప్రజలు భారీ ఆందోళనలు చేస్తున్నారు. తమ దగ్గర ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌ని పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాలకు, నగరాలకు తరలిస్తున్నారని పీఓకే ప్రజలు ఆరోపిస్తున్నారు. ముజఫరాబాద్‌తో పాటు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతాల్లో కూడా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పోలీసులు, భద్రతా సంస్థల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరుగుతున్నాయి. నిరసనల్లో ముఖ్యంగా వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.
శుక్రవారం సమ్మెకు పిలుపునివ్వడంతో చాలామంది నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. దద్యాల్ లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. పాకిస్తాన్ నుంచి తమకు విముక్తి కోరతున్న స్థానికుల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతకు ముందు 2023 ఆగస్టులో కూడా ఇలాగే పీఓకే అంతటా భారీ నిరసనలు జరిగాయి. విద్యుత్ బిల్లులపై పన్నులు విధించడాన్ని తాము తిరస్కరిస్తున్నామని, ఈ ప్రాంతంలోని హైడల్ విద్యుత్ ఉత్పత్తి ధరకు అనుగుణంగా వినియోగదారులు విద్యుత్ అందించాలని మేము డిమాండ్ చేస్తున్నామని ముజఫరాబాద్ ట్రేడర్స్ అసోసియేషన్ ఛైర్మన్ సౌకత్ నవాజ్ మీర్ తెలిపారు. ఇటీవల బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు పీఓకే భారత్‌లో చేరుతుందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ నిరసనలు వ్యక్తం కావడం గమనార్హం.