దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. గుజరాత్, కేరళ, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. గుజరాత్‌లో రెండు స్థానాలకు బైపోల్స్ జరిగాయి. విశావదర్, కడి రెండు స్థానాలకు కౌంటింగ్ నిర్వహించారు. తాజా ఫలితాల్లో బీజేపీ ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక కేరళలోని నీలంబర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పంజాబ్‌లోని లూథియానా వెస్ట్, పశ్చిమ బెంగాల్‌లోని కలిగంజ్ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో జూన్ 19న పోలింగ్ జరిగింది.
ఇది కూడా చదవండి: OPPO K13x 5G: అసలు మిస్ అవ్వద్దు.. కేవలం రూ. 11,999లకే 6000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్లతోపాటు మరెన్నో ..
సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు విజయం దిశగా సాగిపోయారు. విశావదర్‌లో ఆప్ అభ్యర్థి గోపాల ఇటాలియా విక్టరీ సాధించగా.. కడిలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్డా విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నిలంబూర్ నియోజకవర్గంలో విజయం సాధించింది. ఇక భారత ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం… అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్.. లూథియానా వెస్ట్‌లో కూడా ముందంజలో ఉంది. ఇక మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్.. కాలిగంజ్‌లో విజయం దిశగా వెళ్తోంది. గుజరాత్, పశ్చిమ బెంగాల్, పంజాబ్‌లలో ఒక్కొక్క స్థానంలో ప్రస్తుత శాసనసభ్యులు మరణించగా.. కేరళ, గుజరాత్‌లో ఇద్దరు శాసనసభ్యులు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఇది కూడా చదవండి: Phone Tapping : కొత్త మలుపు.. మాజీ సీఎస్ శాంతికుమారి స్టేట్మెంట్ రికార్డ్
కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై వయనాడ్ ఎంపీ ప్రియాంకాగాంధీ హర్షం వ్యక్తం చేశారు. ఆర్యదాన్ షౌకత్‌ను ప్రియాంక అభినందించారు. యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) దార్శనికతపై నమ్మకం ఉంచినందుకు నిలంబూర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల మద్దతుతో ఆర్యదాన్ షౌకత్… పార్టీని ముందుకు నడిపించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక గుజరాత్‌లో ఆప్ విజయం సాధించడం పట్ల ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కార్యకర్తల మనోధైర్యాన్ని పెంచుతుందన్నారు. ఇక పంజాబ్‌లో కూడా విజయానికి దగ్గరగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది ప్రతి కార్యకర్తకు సంతోషకరమైన విషయంగా తెలిపారు.
