Assam Police arrests over 34 people with Al-Qaeda links: అస్సాం రాష్ట్రంలో టెర్రర్ లింకులు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో అస్సాంలోని పలు జిల్లాల్లో ఇమామ్ లుగా పనిచేస్తున్న వారితో పాటు మదరసా కేంద్రంగా ఉగ్ర కుట్రలకు పాల్పడుతున్న వారిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్ ఖైదా అనుబంధంగా ఉన్న అన్సరుల్లా బంగ్లా టీమ్ ఉగ్ర సంస్థ తరుపున పని చేస్తున్నవారిని పోలీసులు పట్టుకున్నారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న 34 మంది వ్యక్తుల్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. తాజాగా గురువారం మరొకరిని గోల్‌పరా జిల్లాలో అరెస్టు చేసినట్లు అస్సాం పోలీసులు వెల్లడించారు.
డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత మాట్లాడుతూ.. అల్ ఖైదాతో అనుబంధంగా ఉన్న 34 మందికి పైగా మందిని అరెస్ట్ చేశామని.. అస్సాంలో ఉగ్రకుట్రలను చేయనివ్వబోమని అన్నారు. బంగ్లాదేశ్ జాతీయులు కొన్ని ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కొన్ని కొత్త ఉగ్రసంస్థలు పుట్టుకొస్తున్నాయని.. యువకుల్లో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపచేస్తున్నారని డీజీపీ తెలిపారు.
Read Also: Courier Thief: మేడమ్ కొరియర్ వచ్చింది.. తలుపు తీస్తే అంతే సంగతి
అస్సాంలో బ్రహ్మపుత్ర నదికి ఇరువైపుల ఉన్న మోరిగావ్, బార్పేట, కామ్ రూప్, నాగావ్, గోల్‌పరా మరికొన్ని జిల్లాల్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు అక్రమంగా ప్రవేశించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. దీనిపై అస్సాం సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. మదరసాల్లోకి కొత్తగా వచ్చేవారి వివరాలను స్థానిక ప్రజలు ఇవ్వాలని సర్కార్ ఆదేశించింది. దీంతో పాటు అస్సాంలో ఉన్న అన్ని మదరసాలు తమ వివరాలను ప్రభత్వానికి సమర్పించాలని ఆదేశించారు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ.
ఇదిలా ఉంటే ఇటు దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో కూడా ఉగ్ర లింకులు బయటపడ్డాయి. ఉగ్రవాద సంబంధాలు ఉన్న యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. చెన్నైలోని ఆర్కే నగర్ లో ఉంటున్న రాజా మహమ్మద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఏడాది కాలంగా తిరువళ్లూర్ లంగాకర వీధిలో ఉన్న తన బావ ఇంట్లో ఉంటూ కూరగాయల దుకాణంలో పనిచేస్తున్న మహమ్మద్ సిగ్నల్ అనే యాప్ ద్వారా ఉగ్రవాదులతో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తమిళనాడులో నెల వ్యవధిలో ఉగ్రలింకులు ఉన్న నలుగురిని అరెస్ట్ చేశారు.