Assam: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సంచలన బిల్లుకు ఆమోదం తెలిపింది. ‘‘బహుభార్యత్వాన్ని’’ నిషేధించే బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు ప్రకారం, ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిలు చేసుకునే వ్యక్తులకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. ఒక వేళ పెళ్లయిన సమాచారాన్ని దాచి పెట్టి మరో వివాహం చేసుకుంటే పదేళ్ల వరకు కఠినమైన శిక్ష విధించబడుతుంది. ఈ బిల్లుపై సీఎం హిమంత మాట్లాడుతూ.. ‘‘ఇది ఇస్లాంకు వ్యతిరేకం కాదు. నిజమైన ఇస్లామిక్ ప్రజలు దీనిని స్వాగతిస్తారు’’ అని అన్నారు.
Read Also: Drishyam 3 Rights: కళ్లు చెదిరే ఆఫర్.. పనోరమా స్టూడియోస్‌కు ‘దృశ్యం3’ థియేట్రికల్ రైట్స్
‘‘ఇస్లాం బహుభార్యత్వాన్ని ప్రోత్సహించదు. ఈ బిల్లు ఆమోదం పొందితే మీరు నిజమైన ముస్లింగా ఉండటానికి అవకాశం లభిస్తుంది. టర్కీ వంటి దేశాలు కూడా బహుభార్యత్వాన్ని నిషేధించాయి. పాకిస్తాన్ లో మధ్యవర్తిత్వ మండలి ఉంది’’ అని హిమంత అన్నారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే యూనిఫాం సివిల్ కోడ్ (UCC)ని ఆమోదిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే, ఈ బిల్లుపై AIUDF పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్‌ను ఉల్లంఘించిందని ఆరోపించారు.
ఒకటి కన్నా ఎక్కువ వివాహాలు చేసుకునే వ్యక్తితో పాటు, ఈ వివాహాలను ప్రోత్సహించే వారిని కూడా ఈ బిల్లు శిక్షిస్తుంది. తల్లిదండ్రులు, గ్రామాధికారులు, వివాహానికి హాజరయ్యే వారు, మతపరమైన నిర్వాహకులకు రెండేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీంతో పాటు దోషులుగా తేలిన వ్యక్తులకు అస్సాం ప్రభుత్వ నిధులు లేదా ప్రభుత్వ ఉపాధి, ప్రభుత్వ పథకాలు, అస్సాంలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా అనర్హులుగా మారుతారు. బాధిత మహిళలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతం, దిమా హసావో, కర్బి ఆంగ్లాంగ్ మరియు పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ ప్రాంతాల్లోని షెడ్యూల్డ్ తెగలకు చెందిన ప్రజలు ఈ బిల్లు పరిధిలోకి రారు. ఈ ప్రాంతాలు ఆరవ షెడ్యూల్ కిందకు వస్తాయి.