కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసోంలోని సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ జారీ చేసిన అడ్వైజరీపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సూచనలు చేయడానికి బదులు క్యాంపస్‌లో భద్రతను పెంచాలంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సదరు ఆస్పత్రి జారీ చేసిన సూచనల అడ్వైజరీని రద్దు చేసినట్లు ప్రకటించింది.
అడ్వైజరీలో ఏముందంటే..
మహిళా డాక్టర్లు, విద్యార్థినులు, సిబ్బంది నిర్మానుష్య ప్రాంతాలు, వెలుతురు తక్కువగా, జనాలు లేని ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.
ఒంటరిగా ఉండకుండా చూసుకోవాలి
అత్యంత అవసరమైతే తప్ప రాత్రి సమయాల్లో హాస్టల్స్ విడిచి బయటకు వెళ్లొద్దు.
ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. అధికారులకు సమాచారం అందించాలి
అనుమానాస్పద వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి
మర్యాదపూర్వకంగా మాట్లాడండి
ఏదైనా వేధింపుల సమస్య ఎదురైతే.. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించండి
ఈ మెమో జారీపై డాక్టర్లు, విద్యార్థులు తీవ్రగా వ్యతిరేకించారు. అడ్వైజరీలో వాడిన పదజాలం తమను బాధించిదని కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ తెలిపింది. గదులకే పరిమితం కావాలని చెప్పే బదులు భద్రతా ఏర్పాట్లు మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. క్యాంపస్‌లో లైటింగ్‌తో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా తమను బాధించిన అడ్వైజరీని సైతం వెనక్కి తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మొదట ఆస్పత్రిలో మహిళా సిబ్బంది ప్రయోజనాలను దృష్టిలో పెట్టకొని ఈ అడ్వైజరీ జారీ చేసినట్లు తెలిపినా.. విద్యార్థుల విమర్శల ఒత్తిడితో వెనక్కి తీసుకున్నట్లు సిల్చార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రకటించింది.