Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధూ జలాలను ప్రస్తావిస్తూ, పాకిస్తాన్ నీటి సమస్యపై ఎప్పుడూ రాజీపడదని అన్నారు. ఎందుకంటే, దేశంలో 24 కోట్ల మంది ప్రజల ప్రాథమిక హక్కులతో ఇది ముడిపడి ఉందని చెప్పారు. గురువారం, పాకిస్తాన్‌లోని పలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్, ప్రిన్సిపాల్స్, ఇతర ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ ఎప్పటికీ భారత ఆధిపత్యాన్ని అంగీకరించదని చెప్పారు. ‘‘పాకిస్తాన్‌కి నీరు అనేది రెడ్ లైన్ అని, 240 మిలియన్ల పాకిస్థానీల ప్రాథమిక హక్కుపై మేము ఎలాంటి రాజీని అనుమతించము’’ అని అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బలూచిస్తాన్‌లోని ఉగ్రవాదులకు భారతదేశం మద్దతు ఇస్తుందని, ప్రావిన్స్‌లో అశాంతిలో పాల్గొన్న ఉగ్రవాదులకు బలూచ్‌లతో సంబంధం ఉందని మునీర్ పేర్కొన్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్ 1960 నాటి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేసింది. అయితే, ఈ చర్యను పాకిస్తాన్ ‘‘యాక్ట్ ఆఫ్ వార్’’గా అభివర్ణించింది. సింధూ జలాలపై పాకిస్తాన్ లోని పలువురు నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రధాని నరేంద్రమోడీ చాలా స్పష్టంగా నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని పాకిస్తాన్‌కి చెప్పాడు. ఉగ్రవాదం ఆపితేనే సింధూ జలాలు వస్తాయని అన్నారు.