Sunita Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రవాల్‌ని చంపేందుకు కుట్ర పన్నారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. తీహార్ జైలులో తన భర్తను చంపడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు. కేజ్రీవాల్ ప్రతీ భోజనాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారని ఆమె అన్నారు.
‘‘అతని భోజనంపై కెమెరాలు అమర్చారు. తినే ప్రతీ ముద్దను పర్యవేక్షిస్తున్నారు. ఇది చాలా సిగ్గు చేటు. షుగర్ పేషెంట్‌గా ఉండీ 12 ఏళ్లుగా ఇన్సులిన్ తీసుకుంటున్నా, తీహార్ జైలు అధికారులు ఇన్సులిన్ తిరస్కరిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిని చంపాలనుకుంటున్నారు.’’ అని సునీతా కేజ్రీవాల్ రాంచీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీలో ఆరోపించారు. కేజ్రీవాల్, హేమంత్ సోరెన్‌లను దోషులుగా నిరూపించకుండా జైలులో పెట్టారని, ఇది నియంతృత్వ పాలన అని విమర్శించారు.
Read Also: Amit Shah: బీహార్‌ని “లాంతరు” యుగానికి తీసుకెళ్లాని ఇండి కూటమి భావిస్తోంది..
నా భర్త చేసిన తప్పేంటి.. మంచి విద్య, వైద్య సదుపాయాలను కల్పిండమేనా..? అని ప్రశ్నించారు. ఢిల్లీ ప్రజల కోసం అరవింద్ కేజ్రీవాల్ తన జీవితాన్ని పణంగా పెట్టారని ఆమె అన్నారు. అతను ఐఐటీ గ్రాడ్యుయేట్, అతను విదేశాలకు వెళ్లవచ్చు, కానీ తను దేశభక్తికి ప్రాధాన్యత ఇస్తారని, ఐఆర్ఎస్ అధికారిగా ఉండీ, ప్రజలకు సేవ చేయడానికి ఉద్యోగాన్ని వదిలేశారని చెప్పారు. అతను ప్రజల కోసం జీవితాన్ని పణంగా పెట్టారని అన్నారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతను తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే, ఆప్ నేతలు మాత్రం ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని, చంపేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే, లిక్కర్ స్కాములో కీలక పాత్రధారి సీఎం కేజ్రీవాల్ అని ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు ఆయన మెడికల్ సమస్యలను చూపించి బెయిల్ పొందేందుకు షుగర్ వ్యాధి ఉన్నప్పటికీ స్వీట్లు, మామిడిపండ్లు, ఆలూ పూరీ వంటివి తింటున్నాడని ఈడీ ఇటీవల కోర్టుకు వెల్లడించింది.