CPM manifesto: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీపీఎం పార్టీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే చట్టవ్యతిరేక కార్యకలాపాల(నివారణ) చట్టం(UAPA), మనీలాండరింగ్ నిరోధక చట్టం(PMLA) వంటి కఠినమైన చట్టాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ రోజు ప్రకటించిన మేనిఫెస్టోలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)ని కూడా రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. బీజేపీని ఓడించాలని, వామపక్షాలను బలోపేతం చేయాలని, కేంద్రంలో ప్రత్నామ్నాయ లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం ఓటర్లను కోరింది.
Read Also: Hema Malini: హేమమాలినిపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు.. మహిళా కమిషన్ నోటీసులు
పార్టీ తన మేనిఫెస్టోలో రాజకీయాల నుంచి మతం వేరు అనే సూత్రానికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. UAPA, PMLA వంటి క్రూరమైన చట్టాల రద్దుకు సీపీఎం అండగా నిలుస్తుందని ప్రకటించింది. ద్వేషపూరిత ప్రసంగాలు, నేరాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చేందుకు పోరాడుతామని తెలిపింది. అతి సంపన్నులపై పన్ను విధిస్తామని, సాధారణ సంపద పన్ను, వారసత్వ పన్నుపై చట్టాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. ఉపాధి హామీ పథకం MGNREGA కోసం బడ్జెట్ కేటాయింపులు తప్పనిసరిగా రెట్టింపు చేయాలని మరియు పట్టణ ఉపాధికి హామీ ఇచ్చే కొత్త చట్టాన్ని తప్పనిసరిగా చట్టబద్ధం చేయాలని పార్టీ పేర్కొంది.
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ, రాష్ట్రాల హక్కులకు హామీ ఇవ్వడంతో పాటు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు, ఎన్నికల సంస్కరణలు చేస్తామని పేర్కొంది. కేంద్రం విధించే సర్‌ఛార్జీలు మరియు సెస్‌ల వాటాతో సహా మొత్తం కేంద్ర పన్నుల వసూళ్లలో 50 శాతం రాష్ట్రాలకు పంపిణీ చేస్తామని పేర్కొంది. ముఖ్యమంత్రి ప్రతిపాదించిన ముగ్గురు వ్యక్తుల ప్యానెల్ ఆధ్వర్యంలో గవర్నర్ ఎంపిక చేస్తామని చెప్పింది. దేశంలో ఓబీసీలపై కులగణన నిర్వహిస్తామని, మహిళలకు మూడింట ఒక వంతు రిజర్వేషన్ తక్షణమే అమలు చేస్తామని, నేరాల బాధితులైన మహిళలకు న్యాయప్రక్రియను బలోపేతం చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది. రాజకీయ పార్టీలకు కొర్పొరేట్ విరాళాలనను నిషేధిస్తామని చెప్పింది.