కేరళలో మరో వ్యాధి కలకలం రేపుతోంది. ఇప్పటికే నిఫా, స్వైన్ ఫ్లూ, కరోనా, మంకీ ఫీవర్ వంటి వ్యాధులు కేరళలో వెలుగు చూశాయి. తాజాగా ఆంత్రాక్స్ వ్యాధి కలవరపెడుతుతోంది. జంతువుల్లో ఎక్కువగా సోకే ఈ వ్యాధి, ఆ జంతువును తిన్నప్పుడు మనుషులకు కూడా సోకే అవకాశం ఉంటుంది.
కేరళలోని త్రిసూర్ అతిరప్పిల్లి అటవీ ప్రాంతంలో కొద్ది రోజులుగా ఆంత్రాక్స్ వ్యాధి సోకుతోంది. దీని కారణంగా అడవి పందులు మరణిస్తున్నాయి. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్రిసూర్ జిల్లా ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి గురువారం వెల్లడించారు. ఈ వ్యాధి సోకి ఇప్పటి వరకు పది వరకు అడవి పందులు మరణించాయి. దీంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. అటవీ ప్రాంతానికి సరిహద్దుల్లో ఉన్న గ్రామాల్లోని పశువులకు పశువర్థక శాఖ టీకాలు వేస్తోంది. ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ప్రస్తుతం వ్యాధి తీవ్రతను ఆమె పర్యవేక్షిస్తున్నారు. అధికారులతో మాట్లాడుతున్నారు.
సహజంగా మట్టిలో ఉండే ఆంత్రాక్స్ బ్యాక్టీరియా గాయాల ద్వారా జంతువుల శరీరంలోకి ప్రవేశిస్తోంది. వ్యాధి తీవ్రత ఎక్కువ అయితే జంతువులు మరణిస్తాయి. ఇలాంటి జంతువులను ఆహారంగా తీసుకుంటే మనుషులకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉడికించి, ఉడికించకుండా తింటే ఖచ్చితంగా మనుషులకు ఆంత్రాక్స్ సోకే అవకాశాలు ఉన్నాయి.