Rahul Gandhi: ‘‘మోదీ ఇంటిపేరు’’ వ్యాఖ్యలను చేసినందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి రెండేళ్లు జైలు శిక్ష పడటంతో పాటు పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత వేటు పడింది. దీంతో ఆయన ఎంపీ పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే మరోసారి ఆయనపై పరువునష్టం కేసుల నమోదు అయింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రంలో భాగంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆయనపై ఈ కేసు నమోదు అయింది. ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కోర్టులో ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా ఫిర్యాదు మేరకు న్యాయవాది అరుణ్ భదౌరియా కేసు నమోదు చేశారు.
Read Also: Raashi Khanna : ఆ విషయంలో షారూఖ్ ఖాన్ను దాటేసిన రాశీ ఖన్నా
ఈ ఏడాది జనవరి 9న హర్యానాలోని అంబాలాలో భారత్ జోడో యాత్ర తర్వాత స్ట్రీట్ కార్నర్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ..ఆర్ఎస్ఎస్ సభ్యులు ‘‘21వ శతాబ్ధపు కౌరవులు’’గా విమర్శించారు. ‘‘కౌరవులు ఎవరు..? మీకు 21వ శతాబ్ధపు కౌరవుల గురించి చెబుతా అంటూ..వారు ఖాకీ హాఫ్ ప్యాంటు ధరించారు, చేతిలో లాఠీలు పట్టుకని, శాఖలు నిర్వహిస్తారు, భారత దేశంలో ఇద్దరు ముగ్గురు బిలియనీర్లు కౌరవులతో నిలబడి ఉన్నారు’’ అంటూ పరోక్షంగా రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశిస్తూ విమర్శించారు. దీనిపై పరువునష్టం కేసు నమోదు కాగా.. దీనిపై ఏప్రిల్ 12న కోర్టు విచారించనుంది.
2019 లోక్ సభ ఎన్నికల ముందు కర్ణాటక కోలార్ లో ప్రసంగిస్తూ ‘‘మోదీ ఇంటిపేరు ఉన్నవారంతా దొంగలే’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ పరవునష్టం దావా వేశారు. దీన్ని విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చి రెండేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం ఎవరైనా ప్రజాప్రతినిధికి రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ కాలం శిక్ష పడితే అతడిని డిస్ క్వాలిఫై చేయాలని చెబుతుంది. దీంతో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది.