Anju Love Story: పాకిస్తాన్ వ్యక్తితో ప్రేమలో పడి అతని కలిసేందుకు వెళ్లిన అంజూ అనే మహిళ గురించి దేశం మొత్తం చర్చించింది. ఇలా వెళ్లిన అంజూ, ఆ దేశంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో నివసిస్తున్న స్నేహితుడు నస్రుల్లాను పెళ్లి చేసుకుంది. అంతే కాకుండా ముస్లిం మతాన్ని స్వీకరించి తన పేరు ఫాతిమాగా మార్చుకుంది.
అయితే ఇటీవల అంజూ పాకిస్తాన్ నుంచి స్వదేశం భారత్‌కి వచ్చింది. పెళ్లై అప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అంజూ, వారందరిని వదిలేసి పాకిస్తాన్ వెళ్లింది. అయితే ప్రస్తుతం ఆమె ఇద్దరు పిల్లలు రాజస్థాన్ లోని భివాడీలో ఉన్నారు. ఇంట్లో ఉన్న పిల్లల్ని ప్రశ్నించగా.. తాము ఆమెను కలమని చెప్పారు. ఈ వారం ఢిల్లీకి చేరుకున్న అంజూ ఆచూకీ తెలియరాలేదు. ఆమె ఇంకా భివాడీకి చేరుకోలేదు, తన పిల్లల్ని కలవలేదు.
Read Also: Fire Accident: తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం..
ప్రస్తుతం అంజూ నివసించిన రెసిడెన్షియల్ సొసైటీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని వాహనాలను, అపరిచిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోనికి అనుమతిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరోకి చెందిన, అంజూ పిల్లలు 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని ప్రశ్నించింది. ప్రస్తుతం ఆమెపై కేసు దర్యాప్తు జరుగుతోంది. పలువురి వాంగ్మూలాలు నమోదు చేసినట్లు భివాడీ ఎస్పీ దీపక్ సైనీ తెలిపారు. అవసరమైతే అంజూను ప్రశ్నించడంతో పాటు అరెస్ట్ చేయవచ్చని అన్నారు.
ఇటీవల వాఘా సరిహద్దు ద్వారా అంజూ భారత్ చేరుకుంది. ఆమెను పంజాబ్ పోలీసులు, స్పై ఏజెన్సీ విచారించిన తర్వాత బుధవారం డిల్లీకి వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెను ప్రశ్నించగా.. నేను ఇప్పుడు ఏం మాట్లాడనని అంజూ చెప్పారు. మరోవైపు ఆమె భర్త అరవింద్ కూడా అంజూ గురించి మాట్లాడేందుకు ఆసక్తి చూపించడం లేదు. వీరిద్దరు విడాకులు తీసుకునేందుకు మరో మూడు నుంచి ఐదు నెలల సమయం పట్టనుంది. అంజు ఇండియాకు రావడానికి ఒక నెల మాత్రమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందింది. న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆమె తన పిల్లల సంరక్షణను విడాకుల తర్వాత మాత్రమే పొందవచ్చు.