Amruta Fadnavis Supports Governor Bhagat Singh Koshyari: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఇటీవల ఛత్రపతి శివాజీపై చేసిన వ్యాఖ్యలు.. మహారాష్ట్ర రాజకీయాల్లో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే! ప్రతిపక్షాలతో పాటు సీఎం షిండే వర్గంలోని నేతలే ఆయన వ్యాఖ్యలపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. గవర్నర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, గవర్నర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ కూడా చేశారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాము శివాజీని దేవుడిలా చూస్తామని, తల్లిదండ్రుల కంటే ఆయన్నే ఎక్కువ పూజిస్తామని నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చినప్పటికీ.. ఈ వ్యవహారం చల్లారలేదు. ఇంకా వేడిగానే సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ గవర్నర్‌కు తన మద్దతు తెలిపారు. కోశ్యారీకి మరాఠీలంటే ఎంతో ప్రేమ అని వ్యాఖ్యానించారు. ‘‘గవర్నర్ కోశ్యారీ గురించి నాకు బాగా తెలుసు. మహారాష్ట్రకు వచ్చిన తర్వాత ఆయన మరాఠీ భాషను నేర్చుకున్నారు. మరాఠీలంటే ఆయనకు ఎంతో ప్రేమ. మరాఠీలను ఆయన గౌరవిస్తారు. ఈ విషయాన్ని నేను దగ్గరుండి గమనించాను. ఆయన చెప్పిన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు. గతంలోనూ ఇలా చాలాసార్లు జరిగింది. ఆయన మనసు నిండా మరాఠీ మనిషే’’ అంటూ అమృతా పేర్కొన్నారు. అయితే.. ఈమె తెలిపిన ఈ మద్దతు, ఏక్‌నాథ్ శిండే – బీజేపీ సర్కారుని మరింత ఇరుకున పడేయడం ఖాయం. షిండే వర్గంలోని నేతలే గవర్నర్‌కు వ్యతిరేకంగా నిలబడ్డారు కాబట్టి, అంతర్గత విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉంది.
కాగా.. ఇటీవల ఓ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో పాల్గొన్న గవర్నర్ కోశ్యారీ, తన ప్రసంగంలో భాగంగా ఛత్రపతి శివాజీ పాతకాలపు నాయకుడని పేర్కొన్నారు. ఇప్పుడు అంబేడ్కర్, నితిన్ గడ్కరీ లాంటి వాళ్లు ఈ తరం వారికి కొత్త నాయకులాగా ఉన్నారన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే మహారాష్ట్రలో రాజకీయంగా తీవ్ర కలకలం సృష్టించాయి. కోశ్యారీ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించిన శివసేన.. ఆయన్ను వెనక్కు తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తోంది.