ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది.. అయితే, అసదుద్దీన్ ఒవైసీపై జరిగిన దాడి ఘటనపై ఇవాళ పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్నారు కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఘటనపై ఇవాళ రాజ్యసభలో ఉదయం 11.10 గంటలకు, లోక్‌సభలో సాయంత్రం 4.10 గంటలకు ప్రకటన చేయనున్నారు అమిత్ షా.. ఇక, ఆదివారం కన్నుమూసిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ పార్లమెంట్ ఉభయ సభలు గంటపాటు వాయిదా పడనున్నాయి..
Read Also: పెరగనున్న కీలక వడ్డీ రేట్లు..!
కాగా, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన ఒవైసీ.. తిరిగి ఢిల్లీకి వెళ్తుండగా.. మీరట్‌లోని టోల్‌ప్లాజా వద్ద ఒవైసీ కారుపై మూడు-నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు.. టోల్ ప్లాజా వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిపిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. ఇక, ఈ ఘటనతో హైదరాబాద్ ఎంపీకి ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకోగా.. ఆ వెంటనే ఆయన తిరస్కరించారు. లోక్‌సభలో ఒవైసీ మాట్లాడుతూ, తనకు భద్రత అక్కర్లేదని, బదులుగా తనను అందరితో సమానంగా “ఎ కేటగిరీ” పౌరుడిగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. నాకు జెడ్ కేటగిరీ భద్రత వద్దు.. మీ అందరితో సమానంగా నేను ‘ఎ’ కేటగిరీ పౌరుడిగా ఉండాలనుకుంటున్నాను. నాపై కాల్పులు జరిపిన వారిపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం ఎందుకు ప్రయోగించలేదు? అని ప్రశ్నించారు. దీంతో.. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఎలాంటి స్టేట్‌మెంట్ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.