NTV Telugu Site icon

Amit Shah: లొంగిపోయిన మావోలపై వరాల జల్లు.. ఇల్లుతో పాటు ఉపాధి కల్పిస్తామని ప్రకటన

Amitshah

Amitshah

లొంగిపోయిన మావోయిస్టులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బస్తర్‌లో లొంగిపోయిన మావోయిస్టులకు 15,000 ఇళ్లు కట్టిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఛత్తీస్‌గడ్ పర్యటన సందర్భంగా అమిత్ షా ఈ కీలక ప్రకటన చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఇల్లుతో పాటు జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ ప్రభుత్వం పునరావాసం కల్పించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తుందని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఆవు లేదా గేదెను, పాడి సహకార సంఘాలు నిర్మించడానికి సహాయం చేస్తామన్నారు. అంతే కాకుండా ప్రతినెల రూ.15,000 ఆదాయం కల్పిస్తామని అమిత్ షా స్పష్టంచేశారు.

ఇది కూడా చదవండి: President Droupadi Murmu: రేపు ఏపీ పర్యటనకు రాష్ట్రపతి.. AIIMS ప్రథమ స్నాతకోత్సవంలో పాల్గొననున్న ముర్ము..

ఆదివారం బస్తర్ ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో అమిత్ షా పాల్గొని మావోలకు గట్టి సందేశం ఇచ్చారు. హింసను విడనాడి పునరావాసం ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. హింసను విడనాడితే పునరావాసం కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. హింసను విడనాడకపోతే భద్రత దళాలు ధీటుగా ఎదుర్కొంటాయని వార్నింగ్ ఇచ్చారు.

ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 287 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారని.. 837 మంది లొంగిపోయారని చెప్పారు. 952 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం బస్తర్ అభివృద్ధి చెందుతోందన్నారు. 2026 బస్తర్ ఒలింపిక్స్ కోసం వచ్చినప్పుడు.. బస్తర్ చాలా మారిందని చెప్పగలనన్నారు. బస్తర్‌లో అసమానమైన ప్రకృతి సౌందర్యం ఉందని చెప్పారు. ఈ ప్రాంతం ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. భవిష్యత్‌లో కాశ్మీర్ కంటే బస్తర్‌కే ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని అమిత్ షా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Pushpa2 : హిందీలో వండర్స్ క్రియేట్ చేస్తున్న పుష్ప -2