Amit Shah: కాంగ్రెస్, డీఎంకే వంశపారంపర్య రాజకీయాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విరుచుకుపడ్డారు. ఆదివారం తమిళనాడు చెన్నైలో ఆయన పర్యటించారు. ఈ రెండు పార్టీల అవినీతిని 2G, 3G, 4Gగా అభివర్ణించారు. తమిళనాడులో ఈ పార్టీలను విసిరిపడేసి, ఈ తమిళనాడు పుత్రుడికి పట్టం కట్టాలి అని పరోక్షంగా అన్నామలైని ఉద్దేశించి అన్నారు. తొమ్మిదేళ్ల నరేంద్రమోడీ పాలనను ప్రజలకు వివరించేందుకు జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్టికల్ 370ని రద్దును వ్యతిరేకించినందుకు ఈ రెండు పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశంలో కాశ్మీర్ ను ఏకం చేసినందుకు ప్రధాని నరేంద్రమోడీని ప్రశంసించారు. కాంగ్రెస్, డీఎంకేలు 2జీ, 3జీ, 4జీ పార్టీలని అన్నారు. ఇక్కడ 2జీ అంటే స్పెక్ట్రమ్ కేటాయింపు కుంభకోణం కాదని, 2జీ అంటే రెండు తరాలు(జనరేషన్స్), 3జీ అంటే మూడు తరాలు, 4జీ అంటే 4 తరాలు అని అభివర్ణించారు. గత
మారన్ కుటుంబం (డిఎంకె) రెండు తరాలుగా అవినీతి చేస్తోందని, కరుణానిధి కుటుంబం మూడు తరాలుగా అవినీతి చేస్తోందని, గాంధీ కుటుంబ 4 తరాలుగా అవినీతి చేస్తోందని ఆయన విమర్శించారు. 2జీ, 3జీ, 4జీలను తరిమికొట్టి తమిళనాడులో అధికారం తమిళరాష్ట్రానికి చెందిన పుత్రుడికి ఇవ్వాల్సిన సమయం వచ్చిందని అన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదా తొలగించే సమయంలో కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాయని గుర్తు చేశారు. 2019 ఆగస్టు 5న ఒక్క కలం పోటుతో ప్రధాని మోడీ కాశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేశారని అన్నారు. అంతకుముందు రోజు అమిత్ షా, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో సహా తమిళనాయకులతో సమావేశం అయ్యారు.