India-Canada: భారతదేశాన్ని చికాకు పెట్టిందుకు, అస్థిర పరిచేందుకు దాయాది దేశం పాకిస్తాన్ ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదలడం లేదు. తాజాగా ఇండియా-కెనడాల మధ్య తీవ్రస్థాయిలో దౌత్యవివాదం చెలరేగుతోంది. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్ లో ప్రకటించడం వివాదాస్పదం అయింది. కెనడా, భారత సీనియర్ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఇదే విధంగా భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను దేశం వదిలి వెళ్లాలని ఆదేశించింది.
ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ గూఢాచర సంస్థ ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’ కెనడా వేదికగా ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు, కీలక వ్యక్తులతో రహస్యంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. కెనడాలోని వాంకోవర్ లో ఈ సమావేశం జరిగింది. భారతదేశానికి వ్యతిరేకంగా మరింత ప్రచారం చేసేలా ప్రోత్సహించినట్లు తెలుస్తోంది. ఖలిస్తానీ గ్రూపులకు ఎప్పటి నుంచో ఐఎస్ఐ ఫండింగ్ ఇస్తోంది.
Read Also: India: ఉగ్రవాదులకు అడ్డాగా కెనడా.. ట్రూడో ఆరోపణలపై సాక్ష్యాలేవీ..?
5 రోజుల క్రితం జరిగిన ఈ సమావేశానికి సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్, ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూతో సహా ఖలిస్తానీ సంస్థల అధినేతలు హాజరయ్యారని నిఘా వర్గాలు తెలిపాయి. ‘ప్లాన్-కే’ పేరుతో ఐఎస్ఐ ఖలిస్తాన్ ఉగ్రసంస్థలకు భారీగా నిధులను సమకూరుస్తోంది. భారత్ కి వ్యతిరేకంగా నిరసనలను నిర్వహించేలా ప్రజల్ని రెచ్చగొడుతోంది. భారత వ్యతిరేక ప్రచారానికి పోస్టర్లు, బ్యానర్లను వినియోగిస్తున్నారు.
జూన్ నెలలో కెనడాలోని బ్రిటీష్ కొలంబియా సర్రే ప్రాంతంలో ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అయితే ఈ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉందని, దీనిపై కెనడా ఎజెన్సీలు విచారిస్తున్నాయని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఈ ఆరోపణలు రాజకీయ పూరితమైన అసంబద్ధ వ్యాఖ్యలుగా భారత్ కొట్టిపారేసింది. కెనడా ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని భారత విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ప్రస్తుతం కెనడాలో 20 మంది ఖలిస్తానీ-గ్యాంగ్‌స్టర్లు తలదాచుకుంటున్నారని ఎన్ఐఏ ప్రకటించింది.