Wrestlers Protest: ఢిల్లీ పోలీసులు మహిళా రెజ్లర్లకు షాకిచ్చారు. నిరసనల సందర్భంగా వారు చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఇక నుంచి జంతర్ మంతర్ దగ్గర రెజ్లర్ల నిరసనకు అనుమతి ఇవ్వబోమని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ వారు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంటే జంతర్ మంతర్ దగ్గర కాకుండా.. వేరే ఎక్కడైనా అనుమతులు ఇస్తామంటూ న్యూఢిల్లీ డీసీపీ కార్యాలయం సోమవారం ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.
Read Also: BJP: శ్రద్ధా వాకర్‌కు న్యాయం జరగలేదు.. ఇప్పుడు మరో హిందూ బాలికను బలైంది.
రెజ్లర్లు పోలీసుల అభ్యర్థనను పట్టించుకోకుండా పార్లమెంట్ మార్చ్‌ను చేపట్టి.. చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అందుకే ఇకపై వాళ్లకు జంతర్ మంతర్ దగ్గర నిరసనకు అనుమతి ఇవ్వడం లేదని తెలిపారు. రెజ్లర్లు గనుక భవిష్యత్తులో నిరసనల కోసం దరఖాస్తు చేసుకుంటే జంతర మంతర్ దగ్గర కాకుండా.. అనువైన ప్రదేశంలో వారి నిరసనకు అనుమతిస్తామని డీసీపీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఆదివారం రెజ్లర్ల నిరసన సందర్భంగా ఆదివారం పోలీసులు వ్యవహారించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు వ్యతిరేకంగా టాప్ రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీ లోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. వీరి ఆందోళనకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో.. రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు ర్యాలీగా వెళ్తుండగా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్, వినేశ్ ఫోగట్, భజరంగ్ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.