Honeymoon Record: సాధారణంగా ఓ జంట వివాహం చేసుకున్న తర్వాత ఒకసారి హనీమూన్‌కు వెళ్లడమే గగనం. ఆర్ధిక పరిస్థితులు బాగుంటే కొందరు రెండు, మూడు సార్లు హనీమూన్ కూడా వెళ్తుంటారు. ఈ లోపే సంతానం కలిగితే హనీమూన్‌కు ఎండ్ కార్డు పడుతుంది. కానీ అమెరికాలోని న్యూయార్క్ ప్రాంతానికి చెందిన ఆనీ, మైక్ హోవార్డ్ జంట రికార్డు స్థాయిలో హనీమూన్ కొనసాగిస్తోంది. 2012లో పెళ్లి చేసుకున్న వీరు ఇప్పటివరకు 64 దేశాల్లో ఎంజాయ్ చేసి ప్రస్తుతం ఇండియాలో విహరిస్తున్నారు. కచ్చితంగా చెప్పాలంటే 10.5 సంవత్సరాలలోఈ జంట 64 దేశాలను సందర్శించింది. ఇప్పట్లో ఈ జంట హనీమూన్‌కు బ్రేక్ చెప్పే దాఖలాలు కనిపించడం లేదు. రోజుకు ఒక వ్యక్తికి సుమారుగా రూ.2,700 బడ్జెట్‌ను నిర్ణయించుకుని ప్రయాణం సాగిస్తున్నారు.ప్రస్తుతం కేరళలోని పరిస్థితులను ఆనీ-హోవార్డ్ జంట ఆస్వాదిస్తోంది. వీరు రెండు వారాలు కేరళలోనే ఉండి ఆ తర్వాత గోవా, ముంబై నుంచి క్రొయేషియాకు వెళ్లనున్నారు.
Read Also: F2F With TammaReddy Bharadwaja: సినిమా పరిశ్రమలో సంక్షోభానికి నిర్మాతలే కారణం
కాగా తమ హనీమూన్ గురించి మైక్ హోవార్డ్ (45) వివరించాడు. తాము భూటాన్ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలిపాడు. న్యూజెర్సీలోని హోబోకెన్‌లో టూ-ఆన్-టూ-వాలీబాల్ ఆడుతున్నప్పుడు ఆనీ(40)ని కలిశానని.. జంటగా భారత్‌కు రావడం మాత్రం ఇదే తొలిసారి అని చెప్పాడు. కేరళలో పరిస్థితులు తమను ఎంతో ఆకట్టుకున్నాయని మైక్ పేర్కొన్నాడు. కేరళలో లభించే కూరగాయలతో చేసిన వివిధ రకాల వంటకాలు తమ జంటకు ఎంతో నచ్చాయని తెలిపాడు. అటు 15 ఏళ్ల క్రితం కాలేజీలో చదువుతున్న సమయంలో పర్సనల్ ట్రిప్‌లో భాగంగా తాను ఇండియా వచ్చినట్లు ఆనీ వివరించింది. ప్రయాణానికి సంబంధించి తామెప్పుడూ ఏదీ ప్లాన్ చేసుకోమని, ప్రయాణ ప్రణాళికను ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతామని తెలిపింది. స్థానికంగా తక్కువ ధరకు లభించే ఆహారం, ఎకామీడేషన్ ఆధారంగా తమ జంటను అందరూ బడ్జెట్ ట్రావెలర్స్ అని పిలుస్తుంటారని అనీ చెప్పింది.