Jagdeep Dhankhar elected India’s new Vice President: భారత ఉప రాష్ట్రపతిగా జగ్ దీప్ ధన్‌కర్ భారీ విజయం సాధించారు. ఎన్డీయే కూటమి తరుపున బరిలోకి దిగిన ధన్‌కర్, యూపీఏ సారథ్యంలో విపక్షాల అభ్యర్థి మార్గరేట్ ఆల్వాపై భారీ విజయాన్ని నమోదు చేశారు. లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు సభ్యులుగా ఉన్న ఎలక్టోరల్ కాలేజీలో ఓట్లలో మెజారిటీ ఓట్లు ధన్‌కర్ కే పడ్డాయి. మొత్తం పార్లమెంట్ సభ్యుల్లోని 780 మంది ఓటర్లలో 725 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంట్లో 528 ఓట్లు ధన్‌కర్ కు రాగా.. మార్గరేట్ ఆల్వాకు కేవలం 182 ఓట్లు మాత్రమే వచ్చాయి. 15 ఓట్లు చెల్లలేదు. 346 ఓట్ల భారీ ఆధిక్యంతో ధన్‌కర్ విజయం సాధించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 92.94 ఓటింగ్ శాతం నమోదు అయింది. ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగ్ దీప్ ధన్‌కర్ గెలిచారని లోక్ సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్ సింగ్ అధికారికంగా వెల్లడించారు.
Read Also: NITI Aayog: సీఎం కేసీఆర్ ఆరోపణల్లో నిజం లేదు.. మీటింగ్ లో పాల్గొనకపోవడం దురదృష్టకరం
భారత 14 వ ఉపరాష్ట్రపతిగా ఆగస్టు 11న జగ్ దీప్ ధన్‌కర్ పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పదవీ కాలం ఈ నెల 10తో ముగుస్తోంది. దీంతో రాష్ట్రపతి, ఉప రాష్గ్రపతులుగా ఎన్డీయే తరుపున పోటీ చేసిన అభ్యర్థులే విజయం సాధించారు. గతంలో బెంగాల్ గవర్నర్ గా విధులు నిర్వహించిన జగ్ దీప్ ధన్‌కర్ తాజాగా ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దీంతో బీజేపీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎన్డీయే కూటమితో పాటు టీడీపీ, బిజూ జనతా దల్, వైసీపీ, జార్ఖండ్ ముక్తీ మోర్చా, బహుజన్ సమాజ్ వాదీ పార్టీ, శివసేన ఏక్ నాథ్ షిండే వర్గం వంటి పార్టీలు కూడా ధన్‌కర్ కు మద్దతు ప్రకటించాయి. చివరి నిమిషంలో త్రుణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఎన్నికకు దూరంగా ఉన్నారు. సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన జగ్ దీప్ ధన్‌కర్ అంచెలంచెలుగా ఉప రాష్ట్రపతి పదవిని అధిరోహించారు.