Amaranath Yatra: పవిత్ర పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్ యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. కశ్మీర్ లోయలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రతికూల వాతావరణం కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. అమర్‌నాథ్ పవిత్ర గుహ పరిసరాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు ముంచెత్తుతున్నాయి. పర్వత ప్రాంతం నుంచి వరదలు వస్తుండడంతో భక్తులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. 4 వేల మంది యాత్రికులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. మూడుగంటల పాటు ఏకధాటిగా వర్షం కురియడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. గుహ చుట్టుపక్కల ఉన్న పర్వతాలలో భారీ వర్షాల కారణంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రిజర్వాయర్లు, సమీపంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇప్పటివరకు 4,000 మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించామని.. పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు.
Praja Sangrama Yatra: మూడో విడతకు ముహూర్తం.. మునుపటి కంటే భారీగా..
జులై 8న క్లౌడ్ బరస్ట్ కారణంగా అమరనాథ్ గుహకు సమీపంలో సంభవించిన వరదల కారణంగా 15 మంది మృతి చెందగా.. 40 మందికి పైగా గల్లంతయ్యారు. గుహ సమీపంలో అనేక గుడారాలు గల్లంతయ్యాయి. భద్రతా దళాలకు చెందిన విపత్తు నిర్వహణా సంస్థలు వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అప్పుడు కూడా అమర్‌నాథ్ యాత్రను నిలిపివేశారు. మళ్లీ జులై 16న యాత్రను తిరిగి ప్రారంభించారు. 43 రోజుల పాటు సాగే వార్షిక అమర్‌నాథ్ యాత్ర జూన్ 30న రెండు ప్రధాన మార్గాల్లో ప్రారంభమైంది. ఆగస్టు 11న రక్షా బంధన్ సందర్భంగా అమర్‌నాథ్ యాత్ర ముగుస్తుంది. ఇప్పటివరకు దాదాపు 2లక్షల 30 వేల మంది యాత్రికులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.