మహారాష్ట్రలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో జరిగిన సమావేశంలో తాజా రాజకీయాలపై విమర్శలు గుప్పించారు.
ఇటీవల కాలంలో మహారాష్ట్రలో లౌడ్ స్పీకర్ల వివాదం చెలరేగుతోంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన( ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే, శివసేన సర్కార్ కు అల్టిమేటం జారీ చేశారు. మసీదుల్లో లౌడ్ స్పీకర్లు తీయకుంటే… వాటి ముందే మేం హనుమాన్ చాలీసా పఠిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వివాదం సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే మధ్య వార్ గా మారింది. మహారాష్ట్రలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం రాజ్ ఠాక్రేల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు చెలరేగాయి. రాజ్ ఠాక్రే వెనక బీజేపీ ఉండీ.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై అక్బరుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఔరంగాబాద్ పర్యటనకు వచ్చిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఎవరిని ( రాజ్ ఠాక్రే) గురించి మాట్లాడటానికి ఇక్కడకు రాలేదని… మాట్లాడే అర్హత లేని వారి గురించి మనం ఎందుకు మాట్లాడాలని, వారికి ఎందుకు సమాధానం చెప్పాలని అక్బరుద్ధీన్ అన్నారు. కుక్కుల మొరుగుతాయి… మొరగనివ్వండి, కుక్కల పని మొరగడమే అని… సింహాలు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తాయని అక్బరుద్దీన్ అన్నారు. వాటి ఉచ్చులో పడకండి… వారు ఏం చేసినా నవ్వుతూ మీ పని చేస్తూ ఉండండి అంటూ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు ఔరంగాబాద్ లోని జౌరంగజేబ్ సమాధి వద్ద నివాళులు అర్పించారు ఒవైసీ.