Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన యూకే జాతీయులకు సంబంధించిన ఓ వార్త సంచలనంగా మారింది. బాధిత కుటుంబాలకు రెండు మృతదేహాలు తప్పుగా పంపించినట్లు బాధిత కుటుంబాల న్యాయవాది తెలిపారు. ప్రమాదంలో మరణించిన ప్రయాణికులు మృతదేహాలకు తిరిగి డీఎన్ఏ టెస్ట్ నిర్వహించడగా, కనీసం రెండు శవ పేటికల్లో వ్యత్యాసాలు వెల్లడయినట్లు ఆరోపించారు. ఈ రెండు మృతదేహాల అవశేషాలు బాధిత కుటుంబాలతో సరిపోలలేదని తెలుస్తోంది.
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో మరణించిన కుటుంబాల తరుపున వాదించే న్యాయవాది జేమ్స్ హేలీ చెబుతున్న దాని ప్రకారం.. జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా AI171 కూలిపోయిన తర్వాత 12 నుండి 13 సెట్ల మానవ అవశేషాలను యునైటెడ్ కింగ్‌డమ్‌కు వచ్చాయని, వీటిలో డీఎన్ఏ విశ్లేషణ తర్వాత బాధిత కుటుంబాలకు వచ్చిన అవశేషాలు వారికి సంబంధించినవి కావని చెప్పారు.
Read Also: Akhilesh Yadav: మసీదులో అఖిలేష్ యాదవ్ మీటింగ్, డింపుల్ యాదవ్ దుస్తులపై వివాదం..
డీఎన్ఏ నమూనాలను ఎయిర్ ఇండియా కాకుండా అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి నిర్వహించింది. గుర్తింపు ప్రక్రియా, మృతదేహాలను అప్పగించడంలో ఎయిర్ ఇండియాకు ప్రమేయం లేదు. మృతదేహాల అవశేషాలను మోసుకెళ్లే శవపేటికలను అంతర్జాతీయ అత్యవసర సేవ సంస్థ అయిన కెన్యాన్ ద్వారా ఎయిర్ ఇండియా కార్గో ద్వారా యూకేకు పంపారు. ఈ విషయంపై ఎయిర్ ఇండియా దర్యాప్తు చేస్తున్నట్లు అంగీకరించింది. అయితే, ఆరోపించిన మృతదేహాల గురించి అధికారిక ధ్రువీకరణ జారీ చేయలేదు.
జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ గాట్విక్‌కు వెళ్తున్న విమానం క్షణాల్లోనే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలోని ఒక్కరు మినహా మొత్తం మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ఉన్నారు. ఇందులో 53 మంది బ్రిటిష్ పౌరులు. చనిపోయిన బ్రిటిష్ పౌరుల్లో అనేక మంది అంత్యక్రియలు భారత్ లోనే జరిగాయి. 12 మృతదేహాలను యూకేకు పంపారు.