కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్ వల్ల దేశ వ్యాప్తంగా భారీగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే బీహార్, తెలంగాణ, హర్యానా ప్రాంతాల్లో హింస చెలరేగింది. కేవలం నాలుగేళ్లకే సర్వీసును పరిమితం చేయడంతో పాటు 17.5 ఏళ్ల నుంచి 21 ఏళ్ల వరకే వయోపరిమితి విధించడంతో వయస్సు దాటిపోయిన చాలా మంది ఆందోళన చెందుతున్నారు. తాజాగా నిన్న వయోపరిమితని మరో రెండేళ్లు పెంచగా.. తాజాగా శనివారం మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.
నిరుద్యోగుల ఆందోళనతో దిగి వచ్చిన కేంద్రం మళ్లీ అగ్నివీరుల తొలి బ్యాచ్ కు మరో 5 ఏళ్ల వయోపరిమితి సడలింపులను ఇచ్చింది. దీంతో ప్రస్తుతం అగ్నివీరుల వయోపరిమితి టోటల్ గా 28 ఏళ్ల వరకు సడలింపు ఇచ్చింది. ఇదే విధంగా కేంద్ర సాయుధ బలగాలు, అస్సాం రైఫిల్స్ లో 10 శాతం రిజర్వేషన్లను కల్పించనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రెండు విభాగాల్లో 10 శాతం ఉద్యోగాలకు అగ్నివీరులకు రిజర్వ్ చేయబడుతాయి. ఈ రెండు విభాగాల్లో చేరేందుకు మూడేళ్లు వయోపరిమితిని సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాయుధ బలగాల కింద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీటీ), శాస్త్ర సీమా బాల్ (ఎస్ఎస్బీ), మరియు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) ఉన్నాయి. వీటన్నింటిలో కలిపి ప్రస్తుతం 70 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అగ్నిపథ్ స్కీమ్ కింద చేరిన వారికి మరింత ప్రయోజనం కలగనుంది.
మరోవైపు దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ స్కీమ్ కు వ్యతిరేఖంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. బీహార్, తెలంగాణ, హర్యానా రాష్ట్రాల్లో విధ్వంసం చెలరేగింది. నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన హింసాత్మక ఘటనల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. బీహార్ లో గత మూడు రోజుల నుంచి ఆందోళనలు మిన్నంటాయి. తాజాగా కేంద్రం తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఆందోళనలు సద్దుమణిగే అవకాశం ఉంది.