Yogi Adityanath: బీజేపీలో 75 ఏళ్ల వయో పరిమితి పదవులకు అడ్డంకిగా మారింది. దీనిని చూపుతూ పలువురు సీనియర్లకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అయితే, తాజాగా ఉద్ధవ్ ఠాక్రే నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ సెప్టెంబర్‌లో రిటైర్ అవబోతున్నారని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఈ వాదనల నేపథ్యంలో మోడీ వారసుడు యోగి ఆదిత్యనాథ్ అనే వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా, ఈ వాదనలపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. బీజేపీ కేంద్ర నాయకత్వంలో విభేదాలు ఉన్నాయనే ఊహాగానాలను యోగి తోసిపుచ్చారు. ఒక వేళ విభేదాలే ఉంటే యూపీ సీఎంగా ఇన్నాళ్లు ఉండేవాడిని కాదని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భవిష్యత్ ప్రధాన మంత్రి అనే వార్తల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలు తన పూర్తికాల ఉద్యోగం కాదని స్పష్టం చేశారు. ‘‘నేను యూపీ సీఎంని, పార్టీ నన్ను యూపీ ప్రజల కోసం ఇక్కడ ఉంచింది. రాజకీయాలు నాకు పూర్తికాల ఉద్యోగం కాదు. ప్రస్తుతం మేము యూపీలో పని చేస్తున్నాము, కానీ వాస్తవానికి నేను ఒక యోగిని’’ అని ఆయన అన్నారు.
Read Also: Waqf Bill: “వక్ఫ్ బిల్లు” పాస్ అవుతుందా.. బీజేపీ, ఇండీ కూటమి బలాబలాలు ఎంత..?
‘‘నేను ఇక్కడ ఉన్నంత కాలం పనిచేస్తాను. దీనికి కూడా ఒక కాల పరిమితి ఉంటుంది’’ అని తన రాజకీయ భవిష్యత్తు, అవకాశాల గురించి చెప్పారు. బీజేపీ హైకమాండ్‌తో విభేదాల గురించి ప్రశ్నించినప్పుడు.. ‘‘విభేదాల ప్రశ్నే లేదని, అన్నింటి కంటే ముఖ్యంగా, పార్టీ వల్లే నేను సీఎంగా ఇక్కడ ఉన్నాను. హైకమాండ్‌తో విభేదాలు ఉంటే నేను ఇక్కడ కూర్చోవడం సాధ్యమా..? ’’ అని ఆయన అడిగారు. ‘‘రెండో విషయం ఏంటంటే, టిక్కెట్ల నిర్ణయాన్ని పార్లమెంటరీ బోర్డు నిర్ణయింస్తుంది. అన్ని విషయాలు పార్లమెంటరీ బోర్డులో చర్చిస్తాను. సరైన స్క్రీనింగ్ ద్వారా విషయాలు ఇక్కడికి చేరుతాయి. కాబట్టి ఎవరైనా ఏదైనా మాట్లాడుతారు, వారి నోరు మూయించడం ఎవరికి సాధ్యం కాదు’’ అని యోగి అన్నారు.
ప్రధాని మోడీ తర్వాత ఆయన వారసుడిగా యోగి ఆదిత్యనాథ్ ప్రధాని అవుతారనేది సాధారణ ప్రజల్లో ఉన్న ఒక వాదన. ఈ నేపథ్యంలో సంజయ్ రౌత్ మోడీ రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, బీజేపీ నేతలు రౌత్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. 2029లో కూడా ప్రధానిగా నరేంద్రమోడీనే ఉంటారని అన్నారు