PM Modi: వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యం, ప్రధాని నరేంద్రమోడీ మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. శనివారం కోల్‌కతా విమానాశ్రయం నుంచి తన వర్చువల్ ర్యాలీ ద్వారా ప్రధాని టీఎంసీపై తీవ్ర విమర్శలు చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం సాగిస్తున్న బీహార్ లాంటి జంగిల్ రాజ్‌ను వదిలించుకోవడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని అనుకుంటున్నారని ప్రధాని అన్నారు.
Read Also: PM Modi: టీఎంసీ అభివృద్ధిని అడ్డుకోవద్దు.. బెంగాల్ ర్యాలీలో వర్చువల్‌గా ప్రసంగించిన మోడీ
ఈ రోజు దేశం వేగవంతమైన అభివృద్ధిని కోరుకుంటోందని, అభివృద్ధి కోసం బీహార్ ప్రజలు మరోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని భారీ మెజారిటీతో గెలిపించారని, బెంగాల్‌లో బీజేపీ విజయానికి బీహార్ మార్గాన్ని సుగమం చేసిందని అన్నారు. బీహార్‌లో జంగిల్ రాజ్ పాలనను అక్కడి ప్రజలు ఒకే గొంతుతో తిరస్కరించారని, 20 ఏళ్ల తర్వాత కూడా జంగిల్ రాజ్ పాలన రావద్దని అనుకున్నారని ప్రధాని చెప్పారు. బెంగాల్‌లో డబుల్ ఇంజన్ సర్కార్ కోసం ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఇప్పుడు బెంగాల్‌లో ‘మహా జంగిల్ రాజ్’ ను వదిలించుకోవాలని అని ప్రధాని తన ప్రసంగంలో బెంగాల్ ప్రజల్ని కోరారు.
పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలోని తహేర్ పూర్ ప్రాంతంలో బహిరంగ సభకు ప్రధాని వెళ్లాల్సి ఉంది. అయితే, ఆ ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఉండటంతో హెలికాప్టర్ ప్రయాణం సాధ్యం కాలేదు. అక్కడ దిగే అవకాశం లేకపోవడంతో, తిరిగి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చారు. కోల్‌కతా ఎయిర్‌పోర్టు నుంచే వర్చువల్‌గా ర్యాలీలో పాల్గొన్నారు.