పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఆదిల్ అహ్మద్ థోకర్‌కు సంబంధించిన కీలక విషయాలను నిఘా సంస్థలు రాబట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడిలో ఆదిల్‌దే కీలక రోల్‌గా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఆదిల్ అహ్మద్ థోకర్.. జమ్మూకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్‌బెహారాలోని గుర్రే గ్రామవాసి. 2018లో విద్యార్థి వీసాపై పాకిస్థాన్ వెళ్లాడు. అక్కడికి వెళ్లాక.. ఉగ్రవాదులతో చేతులు కలిపాడు. ఆరు సంవత్సరాల తర్వాత ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులతో కలిసి కాశ్మీర్‌కు వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు. బైసరన్ లోయలో ఆదిల్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. చంపొద్దని ప్రాధేయపడినా.. ఏ మాత్రం కనికరం లేకుండా ఆదిల్ తూటాల వర్షం కురిపించాడు.
ఆదిల్ పాకిస్థాన్‌కు వెళ్లక ముందే.. సరిహద్దు అవతల పని చేస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్థాన్ చేరుకున్నాక.. పూర్తిగా కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకున్నాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన ఆధారాలు ఇంట్లో ఒక్కటి కూడా దొరకలేదు. డిజిటల్ పాదముద్రను కూడా నిఘా సంస్థలు గుర్తించలేకపోయాయి. లష్కరే తోయిబా భావజాలానికి అతడు పూర్తిగా ఆకర్షితుడైనట్లుగా కనిపెట్టారు. సైద్ధాంతిక మరియు పారామిలిటరీ శిక్షణ కూడా పొందినట్లు సమాచారం.
అయితే గతేడాది చివరిలో ఆదిల్.. భారతదేశంలో ప్రత్యక్షమైనట్లుగా నిఘా వర్గాలు అంచనా వేశాయి. 2024, అక్టోబర్‌లో పూంచ్-రాజౌరి సెక్టార్ ద్వారా నియంత్రణ రేఖ దాటినట్లుగా భావిస్తున్నాయి. అలా భారత్‌లోని పున:ప్రవేశం చేసినట్లుగా గుర్తించాయి. కొండలు, దట్టమైన అడవులు, అక్రమ క్రాసింగ్‌లు ఎక్కువగా ఉండడంతో గస్తీ కళ్లల్లో పడకుండా చాకచాక్యంగా భారత్‌లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.
ఇక ఆదిల్.. అనంత్‌నాగ్ చేరిన తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఒక రహస్య ప్రాంతంలో ఆశ్రయం కల్పించినట్లుగా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. చాలా రోజులు ఆదిల్ ఎవరికి కనిపించకుండానే అత్యంత రహస్యంగా ఉన్నాడు. భారీ లక్ష్యాన్ని ఛేదించాలన్న ఉద్దేశంతో ఆదిల్ కుట్రకు తెరలేపినట్లుగా భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. ఊహించని విధంగా బైసరన్ లోయ తెరుచుకోవడంతో ఇదే అదునుగా ఆదిల్ భావించి ఉంటారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి.
ఏప్రిల్ 22న మధ్యాహ్నం 1:50 గంటల ప్రాంతంలో ఆదిల్.. అతని బృందం బైసరన్ చుట్టూ ఉన్న దట్టమైన అడవి ప్రాంతం నుంచి వచ్చి పర్యాటకులపై రైఫిల్స్‌తో విరుచుకుపడినట్లుగా గుర్తించారు. ఇస్లామిక్ శ్లోకాలను చదవని వాళ్లను టార్గెట్ చేసి చంపేసినట్లుగా కనిపెట్టారు. మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉంటారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. మూడు నిర్దిష్ట ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని 10 నిమిషాల్లో పని పూర్తి చేసినట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉగ్రవాదుల సమాచారం అందిస్తే రూ.20లక్షల రివార్డ్ ఇస్తామని నిఘా సంస్థలు ప్రకటించాయి.