Actor Suriya: తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలోని కల్తీ సారా కేసు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కత్తీ మద్యం కారణంగా జిల్లాలో 53 మంది మరణించారు. ఈ ఘటనపై తమిళనాడులోని సీఎం స్టాలిన్ సర్కార్‌పై విమర్శలు వస్తున్నాయి. ఏఐడీఎంకే, బీజేపీ నేతలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. స్టాలిన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు తెలస్తోంది.
ఈ ఘటనపై ప్రముఖ నటుడు సూర్య స్పందించారు. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కల్తీ మద్యం అమ్మకాలను అరికట్టడంతో తమిళనాడు పరిపాలన విఫలమైందని శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం స్టాలిన్ రాష్ట్రంలో మద్య నిషేధాన్ని అమలు చేయాలని సూచించారు. నిషేధం అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల నినాదంగా మాత్రమే మారిందని అన్నారు. నిషేధ విధానానికి సంబంధించి సీఎం స్టాలిన్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు సూర్య తెలిపారు.
కళ్లకురిచి సంఘటన ఆందోళకరమని, వంద మందికి పైగా ప్రజలు ఇంకా ఆస్పత్రిలో ఉన్నారని, మరణాలు, బాధిత కుటుంబీకుల రోదనలు తన హృదయాన్ని కదిలించాని సూర్య చెప్పారు. ఒక చిన్న పట్టణంలో 50 మంది మరణాలు తుఫానులు, వర్షాలు, వరదల వంటి విపత్తుల సంమయంలో కూడా జరగని విషాదమని అన్నారు.
Read Also: Vangalapudi Anitha: ఈపూరుపాలెంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి
గతేడాది ఇదేవిధంగా విల్లుపురంలో 22 మంది కల్తీసారాకు బలైన విసయాన్ని సూర్య గుర్తు చేశారు. దీర్ఘకాలిక సమస్యకు స్వల్పకాలిక పరిష్కారం పనిచేయదని అన్నారు. ఇప్పుడు పొరుగు జిల్లాలో ఇలా విషపూరిత మద్యమైన మిథనాలు తాగి ప్రజలు మృత్యువాత పడ్డారని, విల్లుపురం విషాదం సమయంలో ప్రభుత్వం సీరియస్‌గా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు ఎలాంటి మార్పు రాకపోవడం బాధాకరమని అన్నారు.
ప్రభుత్వం నడిపే వైన్ షాపుల్లో రూ. 150 మద్యాన్ని కొనుగోలు చేసే స్థోమత లేనివారే రూ. 50 కల్తీ మద్యం తాగుతున్నారని సూర్య అన్నారు. ఇలాంటి మరణాలను తగ్గించడానికి ప్రభుత్వం, పరిపాలన కృషి చేయడం ఓదార్పునిస్తుందని, తక్షణమే చర్యలు తీసుకోవాలని, ప్రతీ జిల్లాలో పునరావాస కేంద్రాలను ప్రారంభించాని ఆయన కోరారు. విద్యార్ధుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం దార్శనికతతో కూడిన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నట్లే, మద్యపాన వ్యసనపరుల పునరావాసానికి కూడా ఇలాంటి కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని అన్నారు.