Nushrratt Bharuccha: ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు శనివారం భీకరదాడి చేశారు. ఏకంగా 5000 రాకెట్లను గాజా నుంచి ఇజ్రాయిల్ వైపు ప్రయోగించారు. ఈ దాడుల్లో 300 మందికి పైగా ఇజ్రాయిలీలు చనిపోగా.. పలువురిని బందీలుగా హమాస్ నిర్బంధించి గాజాకు తీసుకెళ్లింది మరోవైపు ఇజ్రాయిల్ ప్రతీకారంతో రగిలిపోతోంది. గాజా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 250కి పైగా ప్రజలు మరణించారు.
ఇదిలా ఉంటే హమాస్ చేసిన దాడుల తర్వాత బాలీవుడ్ నటి నహ్రత్ భరుచ్చా తప్పిపోయినట్లు వార్తలు వచ్చాయి. నిన్న దాడుల తర్వాత ఆమె ఆచూకీ కనిపించలేదనే పలు నివేదికలు వెల్లడించాయి. హైఫా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం ఆమె ఇజ్రాయిల్ వెళ్లారు. నిన్న మధ్యాహ్నం 12.30 తర్వాత ఆమెతో కాంటాక్ట్స్ కోల్పోయామని టీం సభ్యుల్లో ఒకరు తెలిపారు. దీంతో ఆందోళన నెలకొంది.
Read ALSO: Hamas Attack On Israel: హమాస్ దాడి వెనక ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్-సౌదీ డీల్ అడ్డుకోవడానికేనా..?
అయితే నుష్రత్ భరుచ్చా క్షేమంగానే ఉన్నట్లు తెలిసింది. ఆమె ప్రస్తుతం ఇజ్రాయిల్ నుంచి భారత్ వస్తున్నారు. ఎంబసీ సాయంతో ఆమెను సురక్షితంగా ఇంటికి తీసుకువస్తున్నామని, డైరెక్ట్ ఫ్లైట్ లభించకపోవడంతో కనెక్ట్ ఫ్లైట్ ద్వారా ఇంటికి వస్తున్నామని ఇజ్రాయిల్ వెళ్లిన నటుల బృందం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ వచ్చిన తర్వాత అన్ని విషయాలు తెలియజేస్తామని, మేమంతా సురక్షితంగ ఉన్నామని వెల్లడించారు.
అకెల్లి సినిమా స్క్రీనింగ్ కోసం భరుచ్చా ఇజ్రాయిల్ వెళ్లారు. ఈ సినిమాలో ప్రముఖ వెబ్ సిరీస్ ఫౌడాలో నటించిన ఇజ్రాయిల్ నటులు సాహి హలేవి, అమీర్ బౌట్రస్ కూడా ఉన్నారు. భరుచ్చా తెలుగులో శివాజీ సరసన తాజ్‌మహల్(2010) సినిమాలో నటించారు. బాలీవుడ్ లో ఇప్పటి వరకు 25సినిమాల్లో నటించారు. మరోవైపు ఇజ్రాయిల్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం భారతీయులకు భద్రతా నియమాలను జారీ చేసింద. క్షేమంగా ఉండాలని, బయట రాకపోకలను తగ్గించాని సూచించింది.