Bengal girl murder: పశ్చిమ బెంగాల్‌లో 11 ఏళ్ల బాలిక దారుణ హత్య తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ట్యూషన్ క్లాస్‌కి వెళ్లి వస్తున్న బాలికను కిడ్నాప్ చేసి, హత్య చేసి పొలాల్లో శవాన్ని పారేశారు. ఈ ఘటన దక్షిణ్ 24 పరగణాస్ జిల్లాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన మరవక ముందే ఈ దారుణం జరగడంతో స్థానికంగా తీవ్ర నిరసనలకు, హింసాత్మక ఘటనలకు కారణమైంది.
ఈ కేసులో అరెస్టయని ప్రధాన నిందితుడు మోస్తకిన్ సర్దార్, బాలికను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే, ఆమెపై అత్యాచారం చేయలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విచారణలో.. మోస్తకిన్ తాను బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించానని, అయితే బాలిక ప్రతిఘటించడంతో ఆమెను చంపేసినట్లు వెల్లడించాడు. మృతదేహాన్ని సమీపంలోని కాలువలో పారేసినట్లు పోలీసులకు చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక పోస్టుమార్టం నివేదిక గురించి ఎదురుచూస్తు్నారు.
Read Also: Haryana: బీజేపీ వైఫల్యాలే హర్యానాలో కాంగ్రెస్‌కి బలం.. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నది ఇదే..
శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ట్యూషన్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న బాలికను సర్దార్ కిడ్నాప్ చేశాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు యత్నించాడు, ఆ తర్వాత బాలికని చంపేశాడు. హత్య తర్వాత సర్దార్ ఇంటికి తిరిగి వచ్చి రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. నేరం చేసినందుకు నిందితుడు ఏమాత్రం పశ్చాత్తాపం చూపలేదని పోలీస్ వర్గాలు తెలిపాయి. అదే రాత్రి బాలిక కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక స్నేహితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితుడు మోస్తకిన్ సర్దార్‌ని అరెస్ట్ చేశారు.
చాలా రోజులుగా నిందితుడు అమ్మాయితో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని, ఆమెకు ఐస్ క్రీం ఆఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ హత్యతో స్థానికంగా జిల్లాలో నిరసనలు చెలరేగాయి. పోలీసులు సరిగా విచారించకపోవడంతో తన కూతురు మృతి చెందిదని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఆమెపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కుటుంబీకులతో పాటు బీజేపీ ఆరోపిస్తోంది. వందలాది మంది స్థానికులు పోలీస్ ఔట్ పోస్టుని తగలబెట్టారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మహిళా నిరసనకారులు లాఠీలు, చీపుర్లు, ఆయుధాలతో నిరసన తెలిపారు.