NTV Telugu Site icon

AAP: అఖిలపక్ష భేటీకి కేంద్రం ఆహ్వానించకపోవడంపై ఆప్ ఆగ్రహం

Allpartiesmeeting

Allpartiesmeeting

బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి ఆమ్ ఆద్మీ పార్టీ మినహా ఇండియా కూటమిలోని పార్టీలను కేంద్రం ఆహ్వానించింది. ఈ పరిణామాన్ని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్‌ సింగ్‌ తప్పుపట్టారు. 13 మంది ఎంపీలు ఉండి… జాతీయ హోదా కలిగిన పార్టీని దేశ భద్రతకు సంబంధించిన సమావేశానికి ఆహ్వానించకపోడం నిరాశకు గురిచేసిందని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో నెలకొన్న పరిస్థితులను గురించి విదేశాంగ మంత్రి జైశంకర్‌ రాజ్యసభలో తెలియజేశారన్నారు. ఈ విషయంలో మేం ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలనుకున్నామని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని… అలాంటి కార్యక్రమానికి ఆప్‌ను ఆహ్వానించకపోవడం సరికాదన్నారు. ప్రధానికి ఇష్టమైన పార్టీలకు సంబంధించిన అంశం కాదన్నారు. తమను ఎందుకు ఆహ్వానించలేదో తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ప్రధానికి తమ పార్టీ నచ్చకపోయినంత మాత్రన సమావేశానికి పిలవకపోవడం సరికాదని ఆప్‌ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే సమావేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత వేణుగోపాలస్వామి, తదితరులు హాజరయ్యారు.