Aam Aadmi Party: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ వార్డు కమిటీల ఎన్నికల్లో దళితులకు సరైన ప్రాతినిధ్యం కల్పించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ విఫలమైందని ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ విమర్శించారు. 2022లో త్రివిభజన చేసిన ఏంసీడీ ఏకీకరణ తర్వాత ఈ ఎన్నికలు తొలిసారి జరుగుతున్నాయి. దళితులకు మెరుగైన అవకాశాలను కల్పిస్తామని.. అందులో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికులను క్రమబద్ధీకరిస్తామని.. ఖాళీగా ఉన్న పోస్టులకు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకుంటామని గతంలో ఈ ప్రభుత్వం వాగ్దానం చేసిందని ఆయన తెలిపారు. ఇక, జోనల్ వార్డు కమిటీ ఎన్నికలను జాప్యం చేసేందుకు మేయర్ షెల్లీ ఒబెరాయ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఒబెరాయ్ తన పదవీ కాలాన్ని ఐదు నెలలు మించిపోయారని, దళిత అభ్యర్థిని మేయర్‌గా కాకుండా అడ్డుకున్నారని ఢిల్లీ పీసీసీ చీఫ్ దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు.
ఇక, ఒబెరాయ్ ప్రిసైడింగ్ అధికారులను నియమించకుండా వార్డు కమిటీ ఎన్నికలను నిలిపివేయడానికి ప్రయత్నించారు అని ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ దేవేందర్ యాదవ్ అన్నారు. ప్రక్రియను ఆలస్యం చేయడానికి కోర్టును ఆశ్రయించిన చివరికి అది తిరస్కరించబడింది. ప్రస్తుత ఎంసీడీ పదవీకాలం యొక్క మూడవ సంవత్సరంలో.. ఒబెరాయ్ పదవీకాలం మార్చి 31వ తేదీన ముగిసిన తర్వాత ఏప్రిల్‌లో దళిత అభ్యర్థిని మేయర్‌గా నియమించాలని ఆయన నొక్కి చెప్పారు. అయినప్పటికీ, ఒబెరాయ్ తన పదవిలో కొనసాగుతున్నారు. వార్డు కమిటీ ఎన్నికలను అడ్డుకున్నారు.. దీనిని “చట్టవిరుద్ధం”, రాజ్యాంగ విరుద్ధం” అన్నారు. ఎంసీడీ కార్యకలాపాలపై స్టాండింగ్, వార్డ్ కమిటీలు లేకపోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాన్ని ఎత్తిచూపారు. కౌన్సిలర్లు సమాజ అవసరాలను తీర్చలేకపోయారు అని మండిపడ్డారు. ఆప్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, కమిషనర్‌ల మధ్య విభేదాలు పౌర వ్యవస్థను కుంగదీశాయని దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు.