Shraddha Walkar Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో పోలీసులు కోర్టులో విస్తూపోయే నిజాలు చెబుతున్నారు. గతేడాది శ్రద్ధావాకర్ ను ఆమె బాయ్ ఫ్రెండ్ అఫ్తాబ్ పూనావాలా చంపేసి అత్యంత దారుణంగా శరీరాన్ని 35 ముక్కలుగా చేశాడు. కొన్ని రోజులు పాటు ఫ్రిజ్ లో నిల్వచేసి ఢిల్లీ శివారు ప్రాంతమైన మోహ్రౌలి సమీపంలోని అడవుల్లో పారేశారు. శ్రద్ధావాకర్ తండ్రి మిస్సింగ్ కేసు పెట్టడంతో ఆరు నెలల తర్వాత ఈ కేసు వెలుగులోకి వచ్చింది.
Read Also: Google Doodle: మహిళా నీకు వందనం.. ప్రత్యేక డూడుల్‌తో గూగుల్ శుభాకాంక్షలు..
తాజాగా ఢిల్లీ పోలీసులు కీలక సమాచారాన్ని కోర్టు ముందుంచారు. అఫ్తాబ్ శిక్షణ పొందిన చెఫ్ అని..మాంసాన్ని ఎలా నిల్వచేయాలో, ఎలా కత్తులు వాడాలో తెలుసని కోర్టుకు పోలీసులు తెలియజేశారు. నిందితుడు తాజ్ హోటల్ లో శిక్షణ పొందుతున్నాడని, మాంసాన్ని ఎలా నిల్వ చేయాలో తెలుసని, శ్రద్ధా వాకర్ ను హత్య చేసిన తర్వాత ఫ్లోర్ ను శుభ్రం చేసేందుకు డ్రై ఐస్, అగర్ బత్తీలు, రసాయనాలను వాడాడని పోలీసులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు నేరం మొత్తం క్రమాన్ని కోర్టులో వివరించారని ఢిల్లీ పోలీసుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమిత్ ప్రసాద్ తెలిపారు.
శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన వారం రోజుల వ్యవధిలోనే అఫ్తాబ్ పూనావాలా మరో మహిళతో సంబంధం ఏర్పరచుకున్నాడని, తన కొత్త గర్ల్ ఫ్రెండ్ కు గతంలో శ్రద్ధావాకర్ కు ఇచ్చిన ఉంగరాన్నే ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఇప్పటికే బలమైన సాక్ష్యాలను పోలీసులు సేకరించారు. అఫ్తాబ్ వాడిన కత్తులతో పాటు శ్రద్ధాకు సంబంధించిన ఎముకల డీఎన్ఏ, ఆమె తండ్రి డీఎన్ఏతో సరిపోయింది. దీంతో పాటు పాలిగ్రాఫ్, నార్కో టెస్టుల్లో శ్రద్ధాను తానే హత్య చేసినట్లు అఫ్తాబ్ వెల్లడించాడు.