Lizard In Ice-Cream: పంజాబ్ రాష్ట్రంలోని లూథియానాలో అసహ్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. లూథియానాలోని సుందర్ నగర్ ప్రాంతంలో ఓ ఏడేళ్ల బాలుడు సోమవారం నాడు “మిల్క్ బెల్” పేరుతో నడుస్తున్న బండి నుంచి రూ.20కి రెండు చోకో బార్ కుల్ఫీ ఐస్ క్రీంలను కొనుగోలు చేశాడు. ఇక, ఆ ఐస్ క్రీం తింటుండగా, కప్పులో బల్లిని చూసి వెంటనే వాళ్ల అమ్మమ్మకు సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ ఐస్ క్రీమ్ అమ్ముతున్న వ్యక్తిని ప్రశ్నించగా.. ఇది ఐస్ క్రీం ఫ్యాక్టరీలో ప్యాక్ చేయబడింది.. తాను తయారు చేయలేదని అతడు సమర్థించుకున్నాడు.
Read Also: Thug Life : ఓటిటి రిలీజ్ కోసం దిగొచ్చిన ‘థగ్ లైఫ్’ ..?
అయితే, ఆ ఐస్ క్రీమ్స్ అమ్ముకునే వ్యక్తి స్థానికులతో గొడవపడి అక్కడి నుంచి వెళ్లిపోయి.. అదే ప్రాంతంలో ఐస్ క్రీంలు అమ్మడం కొనసాగించాడు. దీంతో అక్కడి ప్రజలకు ఐస్ క్రీమ్ విక్రేతపై మరింత కోపం రావడంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించకుండా ఉండటానికి, అతన్ని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఐస్ క్రీమ్ లో బల్లి వచ్చిన సంఘటనపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పరిశీలిస్తున్నారు. ఈరోజు (జూన్ 10న) పరీక్ష కోసం ఐస్ క్రీం నమూనాలను సేకరిస్తామని జిల్లా ఆరోగ్య అధికారి (DHO) ధృవీకరించారు.