Site icon NTV Telugu

Dussehra Rally: షిండే వర్గానికి కోర్టు షాక్.. ఆ పార్క్‌లో దసరా వేడుకలకు ఉద్ధవ్‌కు అనుమతి

Shivsena

Shivsena

Dussehra Rally: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేనేతృత్వంలోని శివసేనకు బాంబే హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ముంబైలోని ప్రముఖ శివాజీ పార్క్‌లో దసరా ర్యాలీని నిర్వహించేందుకు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో శివసేనకు చెందిన ఏక్‌నాథ్ షిండే వర్గానికి ఈరోజు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి దావాపై వివాదం పరిష్కారమయ్యే వరకు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవద్దని షిండే వర్గం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.

ముంబై పోలీసులు లేవనెత్తిన శాంతిభద్రతల ఆందోళనల ఆధారంగా ప్రముఖ శివాజీ పార్క్ వద్ద దసరా ర్యాలీ నిర్వహించేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో పాటు ఏక్‌నాథ్ షిండే వర్గానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గతంలో అనుమతి నిరాకరించింది. బీఎంసీ నిర్ణయాన్ని థాకరే వర్గం సవాల్‌ చేసింది. బీఎంసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఆర్‌డీ ధనూకా, జస్టిస్ కమల్ ఖాటా డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. బీఎంసీ ఆదేశాలు న్యాయ ప్రక్రియకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. అక్టోబరు 2 నుంచి 6 వరకు శివాజీ పార్కును ఉపయోగించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని షరతు విధించింది.

ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఎమ్మెల్యే సదా సర్వాంకర్ కూడా బహిరంగ సభ నిర్వహణకు అనుమతించాలని బీఎంసీకి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును కూడా బీఎంసీ సెప్టెంబరు 21న తిరస్కరించింది. ఇరు వర్గాలు దరఖాస్తు చేసినందు వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని స్థానిక పోలీసులు హెచ్చరించారని తెలిపింది.

AIIMS-Delhi: ఎయిమ్స్‌ కొత్త డైరెక్టర్‌గా డాక్టర్‌ ఎం.శ్రీనివాస్‌ నియామకం

శివసేన పార్టీ ఆవిర్భవించిన 1966 నుంచి ప్రతి ఏటా ముంబైలోని శివాజీ మహారాజ్ పార్క్‌లో దసరా వేడుకలను శివసేన నిర్వహిస్తోంది. అయితే కరోనా వల్ల గత రెండేళ్లుగా దసరా ఉత్సవాలు జరుగలేదు. మరోవైపు శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్‌లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్‌ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది. మరోవైపు సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్‌ వర్గం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్‌లో దసరా వేడుకలకు ఇప్పటికే బీఎంసీ నుంచి అనుమతి పొందింది. ఉద్ధవ్ ఠాక్రే ఆగస్టులో ఏక్‌నాథ్‌ షిండేపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమానికి అనుమతి లభిస్తుందో లేదో పార్టీకి ఖచ్చితంగా తెలియదని అన్నారు. ఏది జరిగినా శివాజీ పార్క్ వద్ద దసరా ర్యాలీ నిర్వహిస్తానని ఠాక్రే చెప్పారు. అక్టోబరు 5న జరగనున్న ఈ ర్యాలీలో మహారాష్ట్ర పరిణామాలపై పెద్ద ఎత్తున ప్రసంగించనున్నారు.

Exit mobile version