Sambhal: గతేడాది నవంబర్‌లో సంభాల్ హింసాకాండ యావత్ దేశంలో చర్చనీయాంశంగా మారింది. మసీదు సర్వే కోసం వచ్చిన అధికారులపై ముస్లిం మూక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో నలుగురు మరణించారు. 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. ఈ హింసాత్మక ఘర్షణ జరిగిన ప్రదేశంలో, షాహీ జామా మసీదు సమీపంలో పోలీస్ అవుట్‌పోస్ట్ ప్రారంభించారు. ఈ పోలీస్ అవుట్‌పోస్ట్‌ని 8 ఏళ్ల గుంగున్ కశ్యప్ అనే బాలిక ప్రారంభించడం విశేషం.
గతేడాది నవంబర్‌లో చెలరేగిన కోట్ గర్వి ప్రాంత నివాసి అయిన గుంగున్ రిబ్బన్ కత్తిరించి సత్యవ్రత్ పోలీస్ అవుట్‌పోస్ట్‌ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజేందర్ పెన్సియా, ఎస్పీ కృష్ణ కుమార్ విష్ణోయ్, అదనపు ఎస్పీ (నార్త్) శ్రీష్ చంద్ర, సంభాల్ సర్కిల్ ఆఫీస్ అనుజ్ చౌదరి, అస్మోలి సర్కిల్ ఆఫీసర్ కుల్దీప్ సింగ్, ఇన్స్పెక్టర్ అనుజ్ తోమర్ పాల్గొన్నారు.
Read Also: Heart Attack: కాలేజ్‌లో స్పీచ్ ఇస్తూనే.. గుండెపోటులో మరణించిన 20 ఏళ్ల విద్యార్థిని..
నవంబర్ 24న జరిగిన హింస తర్వాత, ఈ ప్రాంతంలో గట్టి నిఘా పెట్టేందుకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 28న సత్యవ్రత్ పోలీస్ పోస్ట్‌కు శంకుస్థాపన చేశారు. దీనిని నిర్మించేందుకు దాదాపుగా 100 రోజులు పట్టింది. రెండు అంతస్తుల పోలీస్ అవుట్‌పోస్ట్‌లో శాటిలైట్ టవర్, జిల్లా కంట్రోల్ రూం, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. కోట్ పూర్వి, కోట్ గర్వి, కోట్ పశ్చిమ్ ప్రాంతాలపై నిఘా ఉంచేందుకు ఈ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు.
హిందూ పురాణాల ప్రకారం సంభాల్‌కి చాలా ప్రాముఖ్యత ఉంది. భగవాన్ శ్రీ మహా విష్ణువు కలియుగ అవతారం కల్కి ఈ సంభాల్ నుంచే వస్తారని హిందువుల నమ్మకం. వివాదానికి కేంద్రంగా ఉన్న షాహీ జామా మసీదు ఒకప్పుడు హరిహర్ మందిరమని, మొఘల్స్ దీన్ని కూల్చివేసి మసీదు నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీంతో, కోర్టు ఆదేశాల మేరకు సర్వేకు వెళ్లిన సిబ్బందిపై దాడి జరిగింది.