5G services in India: దేశంలో 5జీ సేవలను అక్టోబర్ 1 నుంచి ప్రధాని నరేంద్రమోదీ అట్టహాసంగా ప్రారంభించారు. దేశంలో సాంకేతిక విప్లవానికి 5జీ నాంది పలుతుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే దేశంలో ప్రస్తుతం 13 నగరాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అయితే మొదటగా ఎయిర్ టెల్ వినియోగదారులు మాత్రమే 5జీ సేవలను ఉపయోగించుకోనున్నారు. ప్రస్తుతం 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నగరాల్లో ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, చండీగఢ్. గురుగ్రామ్, హైదరాబాద్, లక్నో, పూణే, గాంధీనగర్, అహ్మదాబాద్, జామ్ నగర్ ఉన్నాయి. ఈ నగరాల్లో ప్రస్తుతం సెలెక్టెడ్ ఏరియాల్లో మాత్రమే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
జియో, భారతీ ఎయిర్ టెల్, వోడాఫోన్-ఐడియా టెలికాం ఆపరేటర్లు ఎంపిక చేసిన నగరాల్లో మాత్రమే 5జీని ప్రారంభించనున్నారు. డిసెంబర్ 2023 నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలను ప్రారంభించాలనే లక్ష్యంతో ఉంది రిలయెన్స్ జియో. ఈ నెలలో కొన్ని నగరాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి జియో వేగంగా అడుగులు వేస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లో జియో తన 5జీ సేవలను తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. మరోవైపు గూగుల్ భాగస్వామ్యంతో తక్కువ ధరలకు 5జీ మొబైల్స్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి జియో ప్రయత్నిస్తోంది.
Read Also: Kerala: పీఎఫ్ఐ నుంచి ప్రమాదం..ఆర్ఎస్ఎస్ నేతలకు వై కేటగిరి భద్రత.
భారతీ ఎయిర్ టెల్ శనివారం నాలుగు మెట్రో నగరాలతో పాటు ఎనిమిది నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించింది. ఢిల్లీ, ముంబై, వారణాసి, బెంగళూరు నగరాల్లో 5జీ సేవలు ప్రారంభం అయ్యాయి. చెన్నై, హైదరాబాద్, సిలిగురి నగరాల్లో కూడా 5జీ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఏయిర్ టెల్ ప్రకటించింది. 2024 నాటికి భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు అందించేందుకు ఎయిర్ టెల్ ప్రయత్నిస్తోంది.
మరో టెలికాం దిగ్గజం వోడాఫోన్-ఐడియా మాత్రం 5జీ సేవలను ఎప్పుడు తీసుకువస్తామనే కాలపరిమితిని చెప్పకున్నా.. గ్రామీణ భారతదేశంలో 5జీ సేవలను అందిస్తామని తెలిపింది. ఇండియాలో 5జీ మొబైల్స్ అందించేందుకు వోడాఫోన్, వన్ ప్లస్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు ఆ సంస్థ తెలిపింది. ఇదిలా ఉంటే కేంద్రం మాత్రం తక్కువ వ్యవధిలోనే దేశంలోని 80 శాతం ప్రజలకు 5జీ చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.