ఢిల్లీలో పొలిటికల్ హీట్ మొదలైంది.. ఆమ్ ఆద్మీ పార్టీ సంక్షోభంలో పడనుందా..? అనే చర్చ మొదలైంది.. సీఎం కేజ్రీవాల్‌తో నిర్వహించిన కీలక భేటీకి చాలా మంది ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంపై… అనుమానాలు రేగుతున్నాయి. ఆప్ మంత్రులు, ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకుని సీబీఐ, ఈడీ సోదాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ పాలసీ స్కామ్‌లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఉచ్చు బిగుస్తోంది. ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యేలను సమావేశానికి పిలిచారు సీఎం కేజ్రీవాల్. ఎమ్మెల్యేలందరినీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే చాలా మంది ఎమ్మెల్యేలు…. టచ్‌లోకి రాలేదని తెలుస్తోంది. దీంతో బీజేపీ ఆప్ ఎమ్మెల్యేలను కొని… ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్రిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి..
70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో అధికార పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే కేజ్రీవాల్‌తో సమావేశానికి 52 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మిగతా వారు ఆప్‌లోనే ఉంటారని, కేజ్రీవాల్ సర్కార్ స్థిరంగా ఉంటుందంటున్నారు ఎమ్మెల్యేలు. అయితే, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ ఎమ్మెల్యే అతిషి మర్లెనా ఆరోపించారు. మా ఎమ్మెల్యేలకు డబ్బులు ఆఫర్ చేసి బెదిరిస్తున్నారని, ఢిల్లీ డిప్యూటీ సీఎంకు కూడా బెదిరింపులు వచ్చాయన్నారు. ఇది మొదటి ప్రయత్నం కాదని, ఇంతకు ముందు కూడా ఇలానే కుట్ర జరిగిందన్నారు. 40 మంది ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం జరిగిందని తిమార్‌పూర్ ఎమ్మెల్యే దిలీప్ పాండే ఆరోపించారు. ఒక్కొక్కరికీ 20 కోట్లు చొప్పున 800 కోట్లు ఇచ్చి.. 40 మంది ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని విమర్శించారు.
మహారాష్ట్ర తరహాలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారును సైతం కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామదాన దండోపాయాలు ప్రయోగిస్తోందన్న ఆరోపణలు కొన్ని రోజులుగా కలకలం సృష్టిస్తున్నాయి.. సీబీఐ, ఐటీ, ఈడీలతో ఎమ్మెల్యేలను బెదిరిస్తోందని వ్యాఖ్యానిస్తూ వస్తోంది ఆప్. ఒక్కో ఎమ్మెల్యేకు 20 కోట్ల రూపాయల నగదు ఇస్తామంటూ, మొత్తం 40మందికి ఆశలు చూపి, ప్రభుత్వాన్ని పతనం చేసేందుకు ప్లాన్ చేస్తోందని కూడా అనుమానం వ్యక్తం చేసింది. ఈ సందేహాలు, ఆందోళనలతో, ఆమ్ ఆద్మీ ఎమ్మెల్యేలందరితోనూ సమావేశం నిర్వహించారు సీఎం కేజ్రీవాల్. అత్యంత కీలక మీటింగ్ గా అందరూ పరిగణించారు.
ఢిల్లీలోని తన నివాసంలో మీటింగ్ వుందని తన ఎమ్మెల్యేలకు కబురు పంపారు ఆమ్ ఆద్మీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రతీ ఎమ్మెల్యే రావాలని స్పష్టం చేశారు. దీంతో కేజ్రీవాల్ ఇంటికి క్యూకట్టారు శాసన సభ్యులు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు. 2020లో జరిగిన ఎన్నికల్లో 62 స్థానాల్లో ఆప్ విజయం సాధించగా, బీజేపీ 8 సీట్లు గెలిచింది. దీంతో 62 మంది ఆప్ ఎమ్మెల్యేల్లో ఎంతమంది కేజ్రీవాల్ సమావేశానికి వస్తారన్న ఉత్కంఠ పెరిగింది. అయితే, మొత్తం 62 మంది ఎమ్మెల్యేల్లో 53మంది వచ్చారని ప్రకటించింది ఆప్. స్పీకర్ సహా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో కేజ్రీవాల్ ఫోన్ లో మాట్లాడారని తెలిపింది. ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్ లోటస్ ను కేజ్రీవాల్ ఫెయిల్ చేశారని, ఎమ్మెల్యేలు ఎవ్వరూ కట్టుదాటలేదని చెప్పింది. మొత్తానికి ఆమ్ ఆద్మీ అనుమానాలు పటాపంచలయ్యాయి. 50మందికి పైగా తమ ఎమ్మెల్యేలందరూ ఒక్క చోటకు చేరడం, వారిని కేజ్రీవాల్ ప్రత్యక్షంగా చూడ్డంతో రిలీఫ్ గా ఫీలయ్యింది. కమలం కుట్రలను తిప్పికొట్టామని దాడి మొదలెట్టింది ఆప్.