Arpita Mukherjee: పశ్చిమ బెంగాల్‌లో టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్‌లో మాజీ మంత్రి పార్థా ఛటర్జీ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా చేపట్టిన తనిఖీల్లో పార్థా ఛటర్జీ సన్నిహితురాలు, సినీ నటి అర్పితా ముఖర్జీ ఇంట్లో గుట్టల కొద్దీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా ఆమెకు చెందిన నాలుగు లగ్జరీ కార్లను వెతికే పనిలో అధికారులు ఉన్నారు. ఆ కార్లలో పెద్ద ఎత్తున డబ్బు దాచిపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కోల్‌కతాలోని ఆమెకు సంబంధించిన ఫ్లాట్‌లలో ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో రూ. 50 కోట్ల నగదు లభించడంతో అర్పితా ముఖర్జీకి చెందిన నాలుగు కార్ల కోసం ఇప్పుడు వెతుకుతున్నట్లు పలు వర్గాలు తెలిపాయి.
ఆడీ ఏ4, హోండా సిటీ, హోండా సీఆర్‌వీ, మెర్సిడెస్ కార్లు నగదుతో నిండి ఉన్నాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. అర్పితా ముఖర్జీ అరెస్టు సమయంలో ఈడీ స్వాధీనం చేసుకున్న తెల్లటి మెర్సిడెస్‌తో పాటు ఇవి ఉన్నాయని వర్గాలు తెలిపాయి. దర్యాప్తు సంస్థ సీసీటీవీ ఫుటేజీని స్కాన్ చేసి వాహనాలను గుర్తించేందుకు పలుచోట్ల దాడులు నిర్వహిస్తోంది. అర్పితా ముఖర్జీకి అనేక ఫ్లాట్‌లు ఉన్నాయి. వీటికి సంబంధించిన సేల్ డీడ్‌లను ఈడీ కనుగొంది. వీటిలో కోల్‌కతాలోని బెల్ఘరియా ప్రాంతంలోని క్లబ్‌టౌన్ హైట్స్‌లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్‌లలో ఒకదానిలో గురువారం ఉదయం నిర్వహించిన దాడిలో దాదాపు రూ.30 కోట్ల నగదు, ఐదు కిలోల బంగారు ఆభరణాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. రెండో ఫ్లాట్ నుంచి ఎలాంటి రికవరీ జరగలేదని ఈడీ అధికారులు తెలిపారు. గత శుక్రవారం, ఈడీ అధికారులు కోల్‌కతాలోని టోలీగంజ్‌లోని అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఫ్లాట్‌లో రూ.21 కోట్ల నగదు, 2 కోట్ల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పార్థా అనుచరులే ఇక్కడ దాచిపెట్టి ఉంటారని అర్పిత చెప్పారు. డబ్బు బయటపడిన గదిలోకి తనను వెళ్లనిచ్చేవారు కాదని ఆమె దర్యాప్తులో చెప్పినట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సన్నిహితంగా ఉన్న పార్థ ఛటర్జీ ప్రస్తుతం తలనొప్పిగా తయాయ్యారు. గురువారం మంత్రి పదవితో పాటు తృణమూల్ కాంగ్రెస్‌లోని అన్ని పదవుల నుండి తొలగించబడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది నియామకాల కోసం రాష్ట్ర మాజీ విద్యాశాఖ మంత్రి లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అర్పితా ముఖర్జీ 2008-2014 మధ్య బెంగాలీ, ఒడియా చిత్రాలలో బాగా నటించారు. వాస్తవానికి బెల్గోరియాలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె కళాశాల రోజుల నుండి మోడల్‌గా రాణించారు.
Fine For No Petrol: ఏందయ్యా.. ఇదీ? బండిలో పెట్రోల్ లేదని రూ.250 ఫైన్
ఇరికించేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారు..: ఈ కుంభకోణం వ్యవహారంపై పార్థా ఛటర్జీ తాజాగా స్పందించారు. ఈ కేసులో ఇరికించేందుకు తనపై కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నోట్ట కట్టల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపడంతో పార్థాను నిన్న మంత్రి పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. టీఎంసీ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఈడీ విచారణలో స్పష్టమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పార్టీ తనను తాను రక్షించుకోవడానికి పార్థ ఛటర్జీని వాస్తవంగా చల్లగా వదిలేశారని రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు. టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తు వల్ల నష్టాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా తృణమూల్ కాంగ్రెస్ ఎత్తుగడ వేస్తోందని వారు తెలిపారు.