Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి నిరసనలతో అట్టుడుకుతోంది. ఇటీవల రిజర్వేషన్ కోటాకు వ్యతిరేకంగా బంగ్లా వ్యాప్తంగా విద్యార్థులు, ప్రజలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లా స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఆందోళన చేయడం హింసాత్మకంగా మారింది. అయితే, అక్కడి సుప్రీంకోర్టు ఈ నిర్ణయంపై స్టే విధించడంతో ఆందోళనలు తగ్గాయి.
అయితే, నిరసనలను పోలీసులతో ఘోరంగా అణిచివేయడంపై మరోసారి ఆ దేశంలో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం రాజధాని ఢాకాలోని సెంట్రల్ ఢాకా స్వ్కేర్‌లో భారీ నిరసన నిర్వహించారు. నిరసనలకు బంగ్లాదేశ్ కీలక నాయకుల్లో ఒకరైన ఆసిఫ్ మహమూద్ పోరాటానికి సిద్ధంగా ఉండాలని తన మద్దతుదారుల్ని కోరాడు. కొంతమంది మాజీ సైనికాధికారులు కూడా విద్యార్థి ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఇక్బాల్ కరీం భుయాన్ మద్దతుగా తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ చిత్రాన్ని ఎరుపుగా మార్చారు.
Read Also: Waqf Board: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకి కేబినెట్ ఆమోదం?.. కేంద్రంపై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం ఆర్మీ చీఫ్ శనివారం ఢాకాలో మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ సైన్యం ప్రజల విశ్వాసానికి చిహ్నం అని చెప్పారు. ఇది ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుంది మరియు ప్రజల కోసం మరియు దేశానినికి ఏ అవసరం వచ్చినా అది చేస్తుందని శనివారం సైన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది.
తాజా నిరసనల్లో 21 మంది మరణించారు. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఆ దేశంలో ఉంటున్న భారతీయుల్ని అప్రమత్తంగా ఉండాలని కోరింది. అత్యవసర పరిస్థితుల్లో, దయచేసి +88-01313076402 నంబర్‌ని సంప్రదించాలని బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం కోరింది. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన హింసాత్మక నిరసనల్లో 200 మందికి పైగా మరణించారు.