Delhi: గుండె జబ్బుతో బాధపడుతున్న రోగికి బ్రెయిన్ డెడ్‌తో మరణించిన మరొకరి గుండెను రికార్డు సమయంలో అమర్చారు. కాలంతో జరుగుతున్న పరుగు పందెంలో గుండెను కోల్‌కతా నుంచి ఢిల్లీకి తరలించారు. దీని కోసం కోల్‌కతా, ఢిల్లీ పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రికి చేర్చారు. మృత్యువు అంచున ఉన్న 34 ఏళ్ల వ్యక్తికి భారీ ఆపరేషన్ నిర్వహించి, కొత్త గుండెను అమర్చారు.
హర్యానాలోని రోహ్‌తక్‌కి చెందిన వ్యక్తి హార్ట్ ఫెయిల్యూర్‌తో బాధపడుతున్నారు. అతడికి గుండె మార్పిడి అత్యవసరం. ఇదే సమయంలో కోల్‌కతాలో ఓ దాత నుంచి గుండె అందుబాటులోకి వచ్చింది. ప్రతీ నిమిషం విలువైంది కావడంతో ఫోర్టిస్ ఆస్పత్రి నుంచి వైద్య నిపుణుల బృందం, విలువైన అవయవాన్ని పొందేందుకు మిషన్ ప్రారంభించింది. 54 ఏళ్ల బ్రెయిన్ డెడ్ మహిళ నుంచి గుండెను సేకరించి కోల్‌కతా నుంచి ఢిల్లీకి తరలించాల్సి వచ్చింది. దీనికి అత్యంత ఖచ్చితత్వం, మానవ సమన్వయం చాలా అవసరం. ప్రతీ నిమిషం కూడా కీలమైనదే.
Read Also: TRAI: మొబైల్ నెట్‌వర్క్ లో అంతరాయం ఏర్పడితే..వినియోగదారులకు పరిహారం!
దీంతో కోల్‌కతా పోలీసులు ట్రాఫిక్ ఏమి లేకుండా హైస్పీడ్ గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి గుండెను ఏయిర్ పోర్టుకి తరలించారు. ఢిల్లీకి వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ గుండెను రవాణా చేశారు. మరోవైపు ఢిల్లీలో భారీ వర్షాలు, వాతావరణం బాగా లేకపోయినప్పటికీ ఢిల్లీ పోలీసులు గురుగ్రామ్ వరకు గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్టిస్ హాస్పిటల్ వరకు 18 కిలోమీటర్ల దూరాన్ని 13 నిమిషాల రికార్డ్ సమయంలో చేరుకుంది.
ఢిల్లీ, గురుగ్రామ్ పోలీసులు 100 మంది గుండెను తీసుకెళ్తున్న అంబులెన్స్‌కి ఏలాంటి అడ్డంకులు రాకుండా చూసుకున్నారు. మొత్తం ఈ ప్రక్రియ నాలుగు గంటలు జరిగింది. డాక్టర్ ఉద్గేత్ ధీర్ నేతృత్వంలోని వైద్య బృందం విజయవంతంగా రోగికి అమర్చింది. ప్రస్తుతం అతడి పరిస్థితి స్థిరంగా ఉంది. డైలేటెడ్ కార్డియోమయోపతి కారణంగా రోగి క్రిటికల్లీ అడ్వాన్స్‌డ్ హార్ట్ ఫెయిల్యూర్ దశలో ఉన్నందున తక్షణమే గుండె మార్పిడి అవసరమైందని ధీర్ చెప్పారు. ఈ మార్పిడి ఆస్పత్రి చరిత్రలోనే మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. తమకు సహకరించిన పోలీసులు, దాత కుటుంబానికి, ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు.