Ayodhya security: అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ కార్యక్రమానికి మరికొన్ని గంటలే సమయం ఉంది. ప్రధాని నరేంద్రమోడీతో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లోని ప్రముఖులు, సెలబ్రెటీలు, దౌత్యవేత్తలు, లక్షలాది మంది రామ భక్తులు అయోధ్యకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. భద్రత కోసమ మల్టీ లెవల్ భద్రత ప్రణాళికలో భాగంగా నగరంలో 13,000 మంది బలగాలను మోహరించారు. రేపు ఈ మహత్తర కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, రజినీ కాంత్, చిరంజీవి, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి వారు రాబోతున్నారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమై 1 గంటకు ముగుస్తుంది. ఈ వేడుకలకు మొత్తం వీవీఐపీలు, సాధువులతో కలిపి 7000 మందికి పైగా ప్రముఖులు వస్తున్నారు.
Read Also: DK Shivakumar: “నా పేరుతో శివుడు, ఆయన పేరులో రాముడు”.. బీజేపీపై డీకే శివకుమార్ విమర్శలు..
భద్రత కట్టుదిట్టం:
అయోధ్య ఎక్కడా చూసిన భద్రతే కనిపిస్తోంది. మొత్తం 13,000 మంది భద్రతను పర్యవేక్షిస్తున్నారు. యాంటీ బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) అయోధ్యలో క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇక ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)ని రంగంలోకి దింపింది. 24×7 పర్యవేక్షణ కోసం అయోధ్య అంతటా 10,000 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. యాంటీ డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. లతా మంగేష్కర్ చౌక్ వద్ద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) సిబ్బందిని మోహరించారు. సరయు నదిపై పోలీసులు తరచూ బోట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.
అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో ‘ప్రాణ్ ప్రతిష్ట’ కోసం భక్తులు, ప్రముఖులు నగరానికి రావడం ప్రారంభించడంతో యాంటీ బాంబ్, డాగ్ స్క్వాడ్‌లను మోహరించారు. వీవీఐపీల కదలికల సమయంలో ట్రాఫిక్‌ని నిర్వహించేందుక ప్రధాన కూడళ్లలో ముళ్ల కంచెను ఉపయోగిస్తున్నారు. నేరస్తుల కదలికను ఎప్పటికప్పుడు పసిగట్టేందుకు ఆర్టిఫిషియల్(AI) కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇక అన్ని భద్రతా సంస్థలు రియల్ టైమ్‌లో సెక్యూరిటీని పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అయోధ్యలోని 51 నిర్దేశిత ప్రదేశాలలో పార్కింగ్ ఏర్పాట్లు చేసింది. 22,825 వాహనాల కోసం పార్కింగ్ స్థలాలు ఉంటాయి. ఈ ప్రదేశాలను నిరంతరం డ్రోన్‌లతో పర్యవేక్షిస్తుంటారు. రామమందిర శంకుస్థాపనకు వచ్చే అతిథుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు 51 స్థలాలను గుర్తించినట్లు ట్రాఫిక్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) బీడీ పాల్సన్ తెలిపారు. ఇక జీవ, రసాయన, అణు దాడుల్ని, భూకంపాల వంటి విపత్తులను ఎదుర్కొనేందుకు శిక్షణ పొందిన NDRF బృందాలు మోహరించబడ్డాయి.