Encounter: మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. 6 గంటల పాటు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎన్‌కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Encounter: మహారాష్ట్రలో భారీ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల హతం..
ఛత్తీస్‌గఢ్ సరిహద్దున ఉన్న వందోలి గ్రామంలో 15మంది మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో మహారాష్ట్ర పోలీసులు ఉదయం 10 గంటలకు గడ్చిరోలి నుంచి భారీ బందోబస్తుతో బయలుదేరారు. డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలోని ఏడు సి-60 పోలీసులు దట్టమైన అడవుల్లోకి మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు వెళ్లారు. మధ్యాహ్నాం ఒంటి గంట ప్రాంతంలో ప్రారంభమైన ఎదురుకాల్పులు ఆరు గంటల పాటు కొనసాగాయి. ఇప్పటి వరకు 12 మంది మావోయిస్టుల మృతదేహాలు, 3 ఏకే 47లు, 2 ఇన్సాస్, 1 కార్బైన్, ఒక ఎస్‌ఎల్‌ఆర్ సహా ఏడు ఆటోమోటివ్ ఆయుధాలు లభ్యమయ్యాయి. మరణించిన మావోయిస్టుల్లో తిప్పగడ్డ దళం ఇన్‌ఛార్జ్ డీవీసీఎం లక్ష్మణ్ ఆత్రం లియాస్ విశాల్ ఆత్రం ఉన్నారు.
గడ్చిరోలిలోని ఝరవండి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టుల తారసపడటంతో ఎన్‌కౌంటర్ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం ఛత్తీస్‌గఢ్ కాంకేర్ ప్రాంతాన్ని అనుకుని ఉంది. ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో సహా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ముందుగా కాంకేర్ తరలించి, అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి తరలించి, ప్రస్తుతం మెరుగైన చికిత్స కోసం నాగ్‌పూర్ తరలించారు.