Bridge collapse:గుజరాత్ రాష్ట్రంలో సురేంద్రనగర్ జిల్లాలో ఘోరం జరిగింది. వస్తాడి ప్రాంతంలో ఆదివారం పాత వంతెన కూలిపోయింది. దీంతో డంపర్, మోటార్ సైకిళ్లతో సహా పలు వాహనాలు వంతెన కింద ప్రవహిస్తున్న నదిలో పడిపోయాయి. వాహనాలతో పాటు ప్రయాణికులు నదిలో పడిపోయారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో 10 మంది గల్లంతయ్యారు. ఇందులో నలుగురిని సురక్షితంగా రక్షించగా.. మిగిలిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగ్రాత్రులను ఆస్పత్రికి తరలించారు.
Read Also: Ravi Kishan: డానిష్ అలీపై చర్య తీసుకోవాలి..స్పీకర్ని కోరిన రేసుగుర్రం విలన్..
జిల్లా కలెక్టర్ సంపత్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి, చురు ప్రాంతాన్ని ఈ వంతెన కలుపుతుంది. వంతెన నిర్మాణం జరిగి 40 ఏళ్లైందని తెలిపారు. వంతెనపై భారీ వాహనాల రాకపోకలను నిషేధించినప్పటికీ, డంపర్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో వంతెన కూలిపోయినట్లు తెలుస్తోందని తెలిపారు. ఈ వంతెనను ఇప్పటికే రోడ్డుభవనాల శాఖకు అప్పగించామని కొత్త నిర్మాణానికి అనుమతి కూడా ఇచ్చామని కలెక్టర్ తెలిపారు.