Tirupati laddus: అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా, 7000 మంది ప్రముఖ అతిథుల సమక్షంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించబడనుంది. ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ మెగా ఈవెంట్‌కి ప్రధాని నరేంద్రమోడీతో పాటు రాష్ట్రముఖ్యమంత్రులు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, సూపర్ స్టార్ రజినీ కాంత్, అమితాబచ్చన్, విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులు హాజరుకాబోతున్నారు.
ఇదిలా ఉంటే అయోధ్యలోని రామాలయ మహా సంప్రోక్షణలో పాల్గొనే అతిథులు, భక్తులందరికీ తిరుపతి వెంకటేశ్వర స్వామికి అందించే ప్రసిద్ధ ప్రసాదమైన ‘శ్రీవారి లడ్డూ’ను అందించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష తిరుపతి లడ్డూలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.
తిరుమలలో ఏర్పాటు చేసిన విలేకరులు సమావేశంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. అయోధ్యలో జరిగే రామమందిర కార్యక్రమంలో భక్తులు, వీవీఐపీలకు సద్భావనగా 25 గ్రాముల పరిమాణం ఉన్న లక్ష లడ్డూలను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సనాతన ధర్మాన్ని అనుసరించే వారికి ఈ కార్యక్రమం చారిత్రాత్మక ఘట్టమని, హిందూమతం, సంస్కృతి, విలువలను ప్రచారం చేయడమే టీటీడీ ప్రాథమిక లక్ష్యం అని ఆయన అన్నారు.